― Advertisement ―

ప్రహరీ గోడకు శంకుస్థాపన…..!

విలియం మూన్ స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన  మొదటి విడతగా రూ. 25 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన మెథడిస్ట్ సంస్థల బిషప్...
HomeNEWSఅన్నదాతల పాలిట 'రక్షక' భటులు..!

అన్నదాతల పాలిట ‘రక్షక’ భటులు..!

spot_img
spot_img
  • వడ్ల తరలింపుకు లారీల ఏర్పాటు
  • గత ఐదు రోజుల్లో 48 లారీల్లో ధాన్యం తరలింపు
  • పత్తాలేని రెవెన్యూ శాఖ అధికారులు
  • రూరల్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్న రైతాంగం

జనవాహిని ప్రతినిధి తాండూరు : రానున్న వర్షాకాలం నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (ఐకేపీ, డీసీఎంఎస్) పేరుకుపోయిన వడ్ల తరలింపుకు రూరల్ పోలీసులు భరోసాలా నిలిచారు. లారీల కొరతతో కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాల మేరకు తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.తాండూరు రూరల్ పరిధిలోని యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు మండలాల్లో ఏర్పాటు చేసిన డీసీఎంఎస్, ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం సకాలంలో మిల్లులకు చేరడం లేదు. లారీలు రాకపోవడంతో భారీ ఎత్తున వడ్ల బస్తాలు కేంద్రాల్లోనే నిలిచిపోయాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన రూరల్ సీఐ, గత ఐదు రోజులుగా ప్రతిరోజూ ఆయా సెంటర్లకు 5 నుంచి 8 లారీల చొప్పున ఇప్పటివరకు సుమారు 48 లారీలను స్వయంగా ఏర్పాటు చేసి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లారీల కొరతతో రైతులు అల్లాడుతున్నా రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదని, పూర్తిగా ముఖం చాటేశారని రైతులు ఆరోపిస్తున్నారు.రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో, సమస్య పరిష్కారం కోసం కొందరు రైతులు నేరుగా రూరల్ సీఐ కార్యాలయానికి తరలివస్తున్నారు. తమ సెంటర్లకు కూడా లారీలను పంపించి, ధాన్యాన్ని తరలించాలని సీఐని వేడుకుంటున్నారు. సకాలంలో లారీలు రాక, వర్షం వస్తే ధాన్యం తడిసిపోతుందనే భయంలో ఉన్న మాకు పోలీసులు దేవుడిలా అండగా నిలిచారు అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ధాన్యం తరలింపునకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రూరల్ పోలీసులకు అన్నదాతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.