- డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్ట్‌లో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పేరు..
- ప్రజా ప్రతినిధి హోదాలో ఉండి కూడా పేదల ఇళ్లకు దరఖాస్తు చేయడమేంటి?
- ఎలాంటి సర్వే లేకుండానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మండిపాటు.
జనవాహిని ప్రతినిధి తాండూరు :ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అధికార పార్టీ నేతల చేతివాటం ప్రదర్శిస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. లబ్ధిదారుల అర్హుల జాబితా లో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు మరియు ఆయన భార్య పేరు ఉండడంపై 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇర్షాద్ మాట్లాడుతూ… బాతుల నాగు గతంలో మాజీ కౌన్సిలర్‌గా ఉన్న సమయంలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి కూడా, పేదలకు దక్కాల్సిన ఇళ్లను దోచుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేయడం అత్యంత విచారకరమని ఆయన విమర్శించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి క్షేత్రస్థాయి పరిశీలన లేదా సర్వేలు నిర్వహించకుండా, తప్పుడు లెక్కలతో లబ్ధిదారులను ఎంపిక చేస్తోందని ఇర్షాద్ ధ్వజమెత్తారు. శనివారం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కార్యక్రమాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అర్హులైన పేదలకు న్యాయం జరగాలని, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారి పేర్లను లిస్ట్ నుండి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.




