- ఆసుపత్రి తరలింపు వివాదాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ ఎత్తుగడ
- వార్డుల్లో సర్వేలు చేయకుండానే ఇళ్ల లిస్టులు సిద్ధం
- బీఆర్‌ఎస్ కౌన్సిలర్ రూపా రుద్రూ పాటిల్ ఆరోపణలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రజలను మభ్యపెట్టేందుకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పేరిట నాటకాలు ఆడుతున్నారని తాండూరు మున్సిపాలిటీ 36వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ రూపా రుద్రూ పాటిల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికారుల సమక్షంలో నిర్వహించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ‘డ్రా’ పద్ధతి అంతా ఒక ప్రహసనమని ఆమె కొట్టిపారేశారు.తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కొడంగల్‌కు మారుస్తున్నారనే తీవ్ర ఆరోపణలను డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని కౌన్సిలర్ రూపా రుద్రు పాటిల్ ఆరోపణ చేశారు. జిల్లా ఆస్పత్రి తరలింపుపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను, ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకే.. స్థానిక ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా ఈ డబుల్ బెడ్‌రూమ్ ల ఎంపిక కార్యక్రమాన్ని హడావుడిగా నిర్వహించారని ఆమె మండిపడ్డారు.వార్డుల్లో ఎలాంటి క్షేత్రస్థాయి పరిశీలన గానీ, అర్హుల సర్వేలు గానీ నిర్వహించకుండానే లబ్ధిదారుల ఎంపిక లిస్టులను ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. డబ్బులు ఇస్తే ఇల్లు ఇప్పిస్తాం అని ప్రజల నుండి వసూళ్లకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులకు, దళారులకు అనుకూలంగానే శనివారం లబ్ధిదారుల ఎంపిక జాబితాను విడుదల చేశారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను, అసలైన నిరుపేదలకు కాకుండా అన్ని వసతులూ ఉన్నవారికి, కాంగ్రెస్ నేతలకు డబ్బులు ఇచ్చుకున్న వారికే కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇంతటి అక్రమాలు జరగడం దురదృష్టకరమని, అర్హులైన నిరుపేదలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని రూపా రుద్రూ పాటిల్ స్పష్టం చేశారు.




