- రూపాయి ఖర్చు లేకుండా పేదవాడి ఇంటి కల నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం
- గతంలో సంక్షేమ పథకాలు నాయకులకు ఆదాయ మార్గాలుగా మారాయి
- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
- తాండూరు మున్సిపాలిటీలో డ్రా పద్ధతి ద్వారా 581 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపిక
జనవాహిని ప్రతినిధి తాండూరు : గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కొందరు నాయకులకు కమీషన్లు తెచ్చిపెట్టే ఆదాయ మార్గాలుగా మారితే.. నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రూపాయి అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తోంది అని తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం తాండూరు పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో పట్టణ పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ర్యాండమైజేషన్ (డ్రా) ప్రక్రియను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం మొత్తం 8,333 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం 581 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి సిఫార్సులు, రాజకీయ జోక్యాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ఈ డ్రా పద్ధతిని ఎంచుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో వార్డు సభ్యుల నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు కోటాలు, వాటాల పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజల అవసరాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ఆనాడు ప్రాధాన్యత ఇచ్చారని, దళిత బంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలను సైతం కమీషన్ల కోసం అమ్ముకున్నారని ప్రజలే బహిరంగంగా విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే గుర్తుచేశారు.ప్రజల కష్టాలు తెలిసిన నాయకత్వం అధికారంలో ఉంటేనే నిజమైన సంక్షేమం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బీఎంఆర్ పేర్కొన్నారు. తాండూరు రూరల్ పరిధిలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, వాటి నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వకుండా మాకు ఇల్లు మంజూరైంది అని లబ్ధిదారులు సంతోషంగా చెప్పడమే తమ ప్రభుత్వ నిజాయితీకి నిదర్శనమన్నారు.మేధావులు, అధికారులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ డ్రా విధానాన్ని అమలు చేశామని, భవిష్యత్తులో ఇందిరమ్మ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియ రాష్ట్రానికే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆనాటి అవినీతి పాలనకు, నేటి అవినీతి రహిత ప్రజా ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకట చారి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, పీడీ హౌసింగ్ దశరథ్ సింగ్, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు మరియు లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




