- తాండూరు 8వ వార్డులో దయనీయంగా మండల పరిషత్ పాఠశాల
- ఒకే గదిలో 4, 5 తరగతుల విద్యార్థులు
- కనీస మూత్రశాలలు లేవు.. ధ్వంసమైన ప్రహరీ గోడ
- పట్టించుకోని యాలాల్ ఎంఈఓ స్థానిక కౌన్సిలర్ జావీద్ ఆగ్రహం
జనవాహిని ప్రతినిధి తాండూరు: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం.. ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం.. కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నాం.. అని కాంగ్రెస్ పాలకు లు చెప్తున్న మాటలన్నీ నీటిమూటలేనని తాండూరు 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ విమర్శించారు. ఇందిరమ్మ, రాజీవ్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న దయనీయ పరిస్థితులు, మౌలిక వసతుల లేమిని చూసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై కొంత చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జావీద్ మాట్లాడుతూ.. కాలనీలోని పాఠశాల దుస్థితి రోజురోజుకూ ఆధ్వానంగా తయారవుతోందని మండిపడ్డారు. 4, 5 తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక తరగతికి పాఠాలు చెబుతుంటే మరో తరగతి విద్యార్థుల దృష్టి మల్లుతోందని, సరిపడా గదులు, ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల చిన్నతనంలోనే విద్యార్థుల చదువు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులను బాగుచేస్తామని గొప్పలు చెప్పడం తప్ప, అమలులో శూన్యమని మండిపడ్డారు. తాండూరు నియోజకవర్గ కేంద్రంలోని ఒక కాలనీ బడి పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాష్ట్రంలో సర్కారు బడుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తారు.పాఠశాలకు కనీసం మూత్రశాలలు కూడా లేకపోవడంతో చిన్న పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారని జావీద్ తెలిపారు. బడికి ఉన్న ప్రహరీ గోడను అకతాయిలు ధ్వంసం చేయడంతో రాత్రి వేళల్లో పాఠశాల ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోందని ఆరోపించారు.ఈ పాఠశాల యాలాల్ మండల విద్యాశాఖ పరిధిలోకి వస్తుందని, మండల విద్యాధికారి తక్షణమే స్పందించి పాఠశాలను సందర్శించాలని డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇకనైనా నిద్రమత్తు వీడి పాఠశాలకు అవసరమైన గదులు, ఉపాధ్యాయులను నియమించి, మూత్రశాలలు, కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారు. చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటమాడకుండా నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చూపించాలని హెచ్చరించారు.




