- శిశుమందిర్ విద్యార్థులకు ఉచితంగా మొక్కల పంపిణీ
- పర్యావరణ సమతుల్యత అందరి బాధ్యత
- విద్యావేత్త పర్యాద రామకృష్ణ
జనవాహిని ప్రతినిధి తాండూరు: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విద్యావేత్త పర్యాద రామకృష్ణ తన జన్మదిన వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేసి పర్యావరణహితంగా తన పుట్టినరోజును నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత అని పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు కృషి చేసినప్పుడే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఇప్పటినుంచే పర్యావరణ పరిరక్షకులుగా మారి వృక్ష సంపదను పెంచాలని పిలుపునిచ్చారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, పర్యావరణ పరిరక్షణపై సమాజంలో విస్తృత చైతన్యం తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత డిగ్రీ అధ్యాపకులు డాక్టర్ మల్లేశం, పెరుమాళ్ల రాంరెడ్డి, అనంతరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు రాం సాగర్, విశాల్, సాయి, నవీన్ మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
