- కూలిపోయిన హాస్టల్ ప్రహరీ గోడ
- తక్షణమే సందర్శించిన చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి
- విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూర్ పట్టణ పరిధిలోని హైదరాబాద్ రోడ్డు మార్గం లో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన వెనుక వైపు ప్రహరీ గోడ కూలిపోయిన ఘటనపై మున్సిపల్ యంత్రాంగం తక్షణమే స్పందించింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి సోమవారం సంఘటనా స్థలానికి చేరుకుని కూలిన ప్రహరీ గోడను పరిశీలించారు. వెంటనే ప్రహరీ గోడ నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం హాస్టల్ పరిసరాలను తనిఖీ చేసి, విద్యార్థుల భద్రతకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో ముచ్చటించిన చైర్‌పర్సన్, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని హాస్టల్ యాజమాన్యంకు ఆదేశించారు. కూలిన ప్రహరీ గోడ స్థానంలో తక్షణమే కొత్త గోడ నిర్మాణ పనులు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రజాక్ భాయ్, స్థానిక వార్డు కౌన్సిలర్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.