- సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
- నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి
- ఎమ్మెల్యే బీయంఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్లే నిధుల రాక
- తాండూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ మున్సిపల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న చిలుకవాగు ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.30 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆర్థిక అనుమతుల జీవో విడుదల చేయడం పట్ల తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు, నిధుల సాధనలో కీలక పాత్ర పోషించిన స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చిలుకవాగు ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి కావాలనే ఆకాంక్షతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. వారం రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను స్వయంగా కలిసి ప్రాజెక్టు అవసరాలను వివరించి, నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి తక్షణమే స్పందించి రూ.30 కోట్ల ఆర్థిక అనుమతులు జారీ చేసిన ప్రభుత్వానికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ అదనపు నిధుల మంజూరుతో చిలుకవాగు ప్రాజెక్టు పనులు వేగవంతమై త్వరలోనే పట్టణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాండూర్ పట్టణ సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.