- ఆర్థిక అనుమతులు ఇస్తూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం
- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషి
- సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూర్ పట్టణ మున్సిపల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న చిలుకవాగు ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 30 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేస్తూ అధికారిక జీవోను బుధవారం విడుదల చేసింది. నిధుల మంజూరుపై స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది.ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే గత వారం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిసి నిధుల అవసరాన్ని విన్నవించారు. పనులు నిలిచిపోకుండా ఉండేందుకు అదనపు నిధులను కేటాయించి, త్వరితగతిన ఆర్థిక అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన డిప్యూటీ సీఎం, తక్షణమే జీవో విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అదనపు నిధుల మంజూరుపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించడం తాండూర్ ప్రజలకు శుభవార్త అని, దీనివల్ల పనులు మరింత వేగంగా పూర్తవుతాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబులకు తాండూర్ ప్రజల తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు.