IIT Hyderabad: ఆ 2 బ్రాంచ్ ల్లో 100 శాతం ప్లేస్ మెంట్స్- టాప్ ప్యాకేజ్ 90 లక్షలు..!
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) మరోసారి ప్లేస్ మెంట్స్ లో సత్తా చాటుకుంది. 2023-24 ప్లేస్‌మెంట్ సీజన్‌లో ఈ ఐఐటీ.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో మంచి ప్లేస్ మెంట్స్ నమోదు చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ ప్లేస్‌మెంట్ రేటు 70.99 శాతంగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్లేస్‌మెంట్ రేటు 69.74 శాతంగా ఉంది. మొత్తం 493 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగా, వారికి 521 ఆఫర్లు అందాయి. వీటిలో 87 ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లు, 43 అంతర్జాతీయ ఆఫర్లు ఉన్నాయి. సగటు వార్షిక ప్యాకేజీ రూ. 22.5 లక్షలు కాగా, టాప్ ప్యాకేజీ రూ.90 లక్షలు.
ఈ ప్లేస్ మెంట్ సీజన్ లో ఐఐటీ హైదరాబాద్ లో ఉద్యోగాల కల్పనకు మొత్తం 320 కంపెనీలు తరలివచ్చాయి. ఇవి ఇంజనీరింగ్, సైన్స్, డిజైన్ , మేనేజ్‌మెంట్ విభాగాల విద్యార్థులను నియమించుకున్నాయి. ప్లేస్‌మెంట్ డ్రైవ్ 2024 డిసెంబర్ 1న ప్రారంభమై, ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ పద్ధతులలో నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో అత్యధికంగా 111 మంది రిజిస్టర్డ్ విద్యార్థులలో 96 మందికి ప్లేస్‌మెంట్లు లభించాయి. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 97 మంది విద్యార్థులలో 81 మందికి ఉద్యోగాలు దక్కాయి. మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో 94 మంది విద్యార్థులలో 65 మందికి, కెమికల్ ఇంజనీరింగ్‌లో 56 మంది విద్యార్థులలో 32 మందికి ప్లేస్‌మెంట్లు లభించాయి. సివిల్ ఇంజనీరింగ్ (36 మంది), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (36), మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ (24), ఇంజనీరింగ్ సైన్స్ (23) ఉన్నాయి.

స్పెషల్ బ్రాంచ్ ల్లో యాడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ (3డి ప్రింటింగ్)100 శాతం ప్లేస్‌మెంట్లు సాధించగా, రిజిస్టర్ చేసుకున్న ఎనిమిది మంది విద్యార్థులందరికీ ఉద్యోగాలు లభించాయి. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో కూడా 100 శాతం ప్లేస్‌మెంట్లు నమోదయ్యాయి. విద్యార్థులు సంవత్సరానికి రూ. 81 లక్షల వరకు ప్యాకేజీలను పొందారు. ప్రోగ్రామ్ స్థాయిలో, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో బీటెక్ విద్యార్థులు 74.56 శాతంతో అత్యధిక ప్లేస్‌మెంట్ రేటును నమోదు చేశారు. వారి అత్యధిక ప్యాకేజీ సంవత్సరానికి రూ. 90 లక్షలుగా ఉంది. ఎం.టెక్ విద్యార్థులు 66.78 శాతం ప్లేస్‌మెంట్ రేటును నమోదు చేయగా, వారి అత్యధిక ప్యాకేజీ రూ. 58 లక్షలకు చేరింది. పీహెచ్‌డీ స్కాలర్లు 100 శాతం ప్లేస్‌మెంట్ రేటును సాధించగా, వారి అత్యధిక ప్యాకేజీ రూ. 81 లక్షలుగా ఉంది. అన్ని ప్రోగ్రామ్‌లలో సంస్థ యొక్క ఓవరాల్ టాప్ ప్యాకేజీ రూ. 90 లక్షలుగా నిలిచింది.

క్యాంపస్ ప్లేస్‌మెంట్లు కాకుండా, పలువురు విద్యార్థులు ఉన్నత విద్య కోసం భారత్ తో పాటు , విదేశాలలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పర్డ్యూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఐఐఎస్‌సి బెంగళూరు, ఐఐటి బొంబాయి, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్ వంటి సంస్ధల్లోనూ అడ్మిషన్లు పొందారు. మొత్తం 206 కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ల కోసం నమోదు చేసుకోగా, 115 కంపెనీలు ఇంటర్న్‌లను నియమించుకున్నాయి. అత్యధిక నెలవారీ స్టైపెండ్ రూ. 19 లక్షలకు చేరగా, సగటు నెలవారీ స్టైపెండ్ 80 వేలుగా ఉంది.



