- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదు
- నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలి
- కేంద్రం వైఖరిపై ధ్వజమెత్తిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
- లక్ష్మినారాయణపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన
జనవాహిని ప్రతినిధి తాండూరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా యాలాల్ మండల పరిధిలోని లక్ష్మినారాయణపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ నీరసనలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాము ఇక్కడికి వచ్చింది రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకేనని స్పష్టం చేశారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన అగ్రనేత రాహుల్ గాంధీపై పోలీసులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో తాండూరు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.దేశంలో లక్షలాది మంది విద్యార్థులు డాక్టర్ కావాలనే లక్ష్యంతో, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నారని పేర్కొన్నారు. అయితే పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవకతవకల వల్ల వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి కఠినమైన చట్టాలు రూపొందించాలని స్పష్టం చేశారు.