గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. ఆ వ్యాధే కారణమా..?
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం ఉంటుంది. ఆయన సినిమాలు థియేటర్ల వద్ద భారీ ఓపెనింగ్స్ ను నమోదు చేస్తుంటాయి. 2015 లో భజరంగీ బైజాన్, 2016 లో సుల్తాన్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. అయితే ఆ తర్వాత సల్లూభాయ్ చేసిన ట్యూబ్ లైట్, టైగర్ జిందా హై, రేస్ 3, భారత్, దబాంగ్ 3, టైగర్ 3, సికందర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ సినిమాలకు ఆశించినంత ఫలితం రాలేదు. దాంతో సల్మాన్ ఖాన్ కు సరైన హిట్టు పడి దాదాపు 10 ఏళ్లు అయిందనే చెప్పాలి. ప్రస్తుతం దేశభక్తి నేపథ్యం ఉన్న మాతృభూమి అనే సినిమాను చేస్తున్నారు సల్మాన్ ఖాన్.
ఈ మూవీని భారత్- చైనా మధ్య జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఏడాది ఆగస్టు 14 న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనూ సల్మాన్ ఖాన్ ఓ సినిమా చేస్తున్నారు. అలాగే కిక్ 2 సినిమా కూడా లైన్ లో ఉన్నట్లు సమాచారం. ఇక సల్మాన్ ఖాన్ కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ ఏంటి ఇలా మారిపోయాడు అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్ల వయసులోనూ కండలు తిరిగిన దేహంతో కుర్ర హీరోలతో పోటీ పడే సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా ఇలా అయిపోయారేంటి..? అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జులై 18న ముంబైలోని బాంద్రాలో ఉన్న స్లమ్ రిహ్యాబిలిటేషన్ అథారిటీ (SRA) ఆఫీస్ కు సల్మాన్ ఖాన్ వచ్చారు. అక్కడ ఒక కొత్త డేటా సెంటర్ ను ప్రారంభించారు. అలాగే కాఫీ టేబుల్ బుక్ ను సల్మాన్ ఖాన్ ఆవిష్కరించారు. 50 మందికి పైగా లబ్ధిదారుల శాశ్వత గృహాలకు సంబంధించిన తాళాలను ఆయన స్వయంగా అందజేశారు. ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ లుక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

ఈమేరకు సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో వచ్చిన ట్రై జెమినల్ న్యూరాల్జియా(ఫేషియల్ నర్వ్ పెయిన్) మళ్లీ తిరగబడిందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం వయసు మీద పడటం కారణంగా ఈ మార్పులు వస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
