- రూ. 290 కోట్ల పనులన్నీ బూటకమే.. దొంగ ప్రొసీడింగ్‌లతో వస్తున్నారు
- మండిపడుతున్న గులాబీ శ్రేణులు.. 16న తాండూరు పర్యటనపై ఉత్కంఠ
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఈ నెల 16వ తేదీన తాండూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రుల పర్యటన తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ప్రభుత్వ విఫల విధానాలను నిరసిస్తూ, మంత్రుల రాకను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని బిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో రూ. 290 కోట్ల వ్యయంతో భారీ అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేయడంపై బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవన్నీ కేవలం ప్రజలను నమ్మించేందుకు సృష్టించిన దొంగ ప్రొసీడింగ్ కాపీలు అని వారు మండిపడ్డారు. తప్పుడు పత్రాలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్న మంత్రులను ఎట్టిపరిస్థితుల్లోనూ తాండూరులో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు.తాండూరు నియోజకవర్గానికి ప్రభుత్వం చేసిందేమీ లేదని, అసలు ఏ ముఖం పెట్టుకుని మంత్రులు ఇక్కడికి వస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి శూన్యమని తెలిసినా.. బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికే ఈ పర్యటనలు చేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ శ్రేణుల హెచ్చరికల నేపథ్యంలో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 16వ తేదీన తాండూరులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోననే ఉత్కంఠ స్థానికంగా నెలకొంది.