spot_img
HomeBusinessరూ.1.24 లక్షలకే యమహా ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ లాంచ్.. E20 నుంచి E85 వరకు ఏదైనా...

రూ.1.24 లక్షలకే యమహా ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ లాంచ్.. E20 నుంచి E85 వరకు ఏదైనా ఓకే

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి

రూ.1.24 లక్షలకే యమహా ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ లాంచ్.. E20 నుంచి E85 వరకు ఏదైనా ఓకే

భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, E20 పెట్రోల్ ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థలు కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్ ఈ విభాగంలో తమ మోడళ్లను పరిచయం చేయగా, తాజాగా జపాన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా కూడా ఈ జాబితాలో చేరింది. కంపెనీ యమహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్(Yamaha Fz Blue Flex Fuel Bike) పేరుతో కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

ఈ కొత్త బైక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనాలపై సజావుగా నడిచేలా రూపొందించబడింది. అంటే, వినియోగదారులు అందుబాటులో ఉన్న ఇథనాల్ మిశ్రమాన్ని బట్టి బైక్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది పర్యావరణహిత రవాణాకు తోడ్పడటమే కాకుండా, భవిష్యత్తులో ఇథనాల్ వినియోగం మరింత పెరిగే అవకాశాలను కూడా దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసిన మోడల్‌గా చెప్పవచ్చు.

Yamaha Fz Flex Fuel Motorcycle Launched In India At Rs 1 24 Lakh Here Features Design

ధర విషయానికి వస్తే, యమహా FZ బ్లూ ఫ్లెక్స్ బైక్‌ను కంపెనీ రూ.1.24 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బైక్‌లో కంపెనీ ఇప్పటికే FZ సిరీస్‌లో ఉపయోగిస్తున్న 149 సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌నే అందించింది.

అయితే ఈ ఇంజిన్‌ను ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీకి అనుగుణంగా ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. ఇంజిన్ 7,250 rpm వద్ద 11.7 bhp గరిష్ట పవర్, 6,000 rpm వద్ద 12.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ FZ మోడల్‌తో పోలిస్తే పవర్ 0.7 bhp, టార్క్ 0.5 Nm మేర స్వల్పంగా తగ్గినప్పటికీ, రోజువారీ వినియోగంలో పనితీరుపై పెద్దగా ప్రభావం ఉండదని కంపెనీ భావిస్తోంది.

Yamaha Fz Flex Fuel Motorcycle Launched In India At Rs 1 24 Lakh Here Features Design

డిజైన్, హార్డ్‌వేర్ పరంగా కూడా యమహా పెద్దగా మార్పులు చేయలేదు. ఇప్పటికే FZ సిరీస్‌కు ఉన్న స్పోర్టీ లుక్‌ను అలాగే కొనసాగిస్తూ, LED హెడ్‌ల్యాంప్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఫాక్స్ ఎయిర్ వెంట్స్, సింగిల్-పీస్ సీట్ వంటి అంశాలను యథాతథంగా ఉంచింది. దీంతో ఈ బైక్ సంప్రదాయ FZ మోడల్‌ను పోలిన రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కారణంగా ప్రత్యేక గుర్తింపును పొందుతోంది.

రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. భద్రత విషయంలో కూడా కంపెనీ ఎలాంటి రాజీ పడకుండా సింగిల్-ఛానల్ ABSను కొనసాగించింది. మొత్తంగా చూస్తే, డిజైన్, పనితీరు, భద్రతా ఫీచర్లను యథాతథంగా ఉంచుతూ, ఫ్లెక్స్ ఫ్యూయల్ సామర్థ్యాన్ని జోడించడం ద్వారా భవిష్యత్తు ఇంధన అవసరాలకు అనుగుణంగా యమహా FZ బ్లూ ఫ్లెక్స్‌ను రూపొందించింది.

ప్రస్తుతం యమహా FZ బ్లూ ఫ్లెక్స్ బైక్‌ను కంపెనీ మెటాలిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందిస్తోంది. ఈ మోడల్‌ను ప్రారంభ దశలో దేశవ్యాప్తంగా కాకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే విక్రయించాలని యమహా నిర్ణయించింది. అందులో భాగంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన యమహా బ్లూ స్క్వేర్ (Blue Square) డీలర్‌షిప్‌ల ద్వారా ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments