Home News నాతో ఉండాల్సిందే’..!

నాతో ఉండాల్సిందే’..!

285
0
  • వివాహిత వేధింపులకు యువకుడు బలి
  • తప్పు తెలుసుకుని దూరం జరగాలనుకున్నా వదలని మహిళ
  • పరువు తీస్తా’నంటూ ఫోన్లలో తీవ్ర బ్లాక్‌మెయిలింగ్
  • మనస్తాపంతో వికారాబాద్ యువకుడి ఆత్మహత్య
  • హైదరాబాద్‌లో నిందితురాలి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

జనవాహిని ప్రతినిధి తాండూరు : సాధారణంగా మహిళలపై పురుషుల వేధింపుల గురించి వింటుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఒక వివాహిత వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ను తట్టుకోలేక ఓ వివాహిత యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విచిత్ర, విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. తప్పు తెలుసుకుని బంధాన్ని తెంచుకోవాలని ప్రయత్నించడమే ఆ యువకుడు చేసిన పాపమైంది.పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన గాండ్ల శివకుమార్ (31)కు వివాహమై భార్య చంద్రకళ ఉంది. అయితే, అదే గ్రామానికి చెందిన మరో వివాహితతో శివకుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల పాటు వీరి వ్యవహారం గుట్టుగా సాగింది.కొన్ని రోజుల తర్వాత శివకుమార్ తన తప్పును గ్రహించాడు. ఎలాగైనా ఈ వివాహేతర బంధం నుంచి బయటపడి, తన కుటుంబంతో ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆమెకు దూరం జరగడం ప్రారంభించాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. శివకుమార్ దూరం పెట్టడాన్ని ఆమె సహించలేకపోయింది. నన్ను వదిలేయడం ఏంటి..? నాతో ఎఫైర్ కంటిన్యూ చేయాల్సిందే అంటూ శివకుమార్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ గొడవ కాస్తా ఊరి పెద్దల వరకు వెళ్లడంతో.. వారు ఇరుపక్షాలను పిలిచి, ఎవరి దారి వారు చూసుకోవాలని, గొడవలు పడవద్దని గట్టిగా మందలించి పంపారు.పెద్దలు మందలించినా సదరు మహిళ తీరు మారలేదు. పంచాయితీ తర్వాత ఆమె మరింత రెచ్చిపోయింది. శివకుమార్‌కు నేరుగా ఫోన్లు చేస్తూ.. నాతో సంబంధం కొనసాగించకపోతే నీ పరువు బజారున ఈడుస్తా అంటూ తీవ్రస్థాయిలో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. ఒకవైపు సమాజంలో పరువు పోతుందనే భయం, మరోవైపు ఆమె నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ వేధింపులతో శివకుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమె పెడుతున్న మానసిక క్షోభను భరించలేక శివకుమార్ తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ మహిళ వేధింపుల వల్లే తన భర్త చనిపోయాడంటూ భార్య చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివకుమార్ మృతికి కారణమైన సదరు మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తలదాచుకున్న నిందితురాలిని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో యాలాల పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నిందితురాలిని జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here