యమహా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఒక్కదానిలో రెండు బ్యాటరీలు.. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్
ప్రీమియం ఎలక్ట్రిక్ టూవీలర్ సెగ్మెంట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసే దిశగా జపాన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ వాహన తయారీ సంస్థ యమహా కీలక అడుగు వేసింది. యువతను లక్ష్యంగా చేసుకుని కంపెనీ తన కొత్త యమహా ఏరోక్స్ ఇ (yamaha aerox e) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, అధునాతన ఫీచర్లతో తయారు చేసిన ఈ స్కూటర్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో కొత్త పోటీకి నాంది పలకనుంది. డిజైన్ పరంగా చూస్తే, కొత్త ఏరోక్స్ E తన పెట్రోల్ వెర్షన్ ఏరోక్స్ 155 నుంచి ప్రేరణ పొందింది.
అగ్రెసివ్ ఫ్రంట్ ఫేసియా, షార్ప్ బాడీ లైన్స్, స్పోర్టీ స్టాన్స్‌ను అలాగే కొనసాగిస్తూ ఎలక్ట్రిక్ అవతార్‌లోకి వచ్చింది. దీంతో ఒక చూపులోనే ఇది యమహా ఏరోక్స్ కుటుంబానికి చెందిన మోడల్ అని గుర్తించవచ్చు. ధర విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.2.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ ధరతో ప్రస్తుతం భారత మార్కెట్లో యమహా విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన టూవీలర్ వాహనంగా ఏరోక్స్ ఇ నిలిచింది.

గతంలో తీసుకొచ్చిన EC-06 తర్వాత భారత మార్కెట్లో యమహా తీసుకొచ్చిన రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. భారత మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడితే, యమహా మాత్రం ఏరోక్స్ ఇ తో పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు స్పోర్టీ రైడింగ్ అనుభవాన్ని కోరుకునే యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది.
బ్యాటరీ, పనితీరు పరంగా యమహా ఏరోక్స్ ఇ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో తొలగించి తీసుకెళ్లే రెండు లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఒక్కో బ్యాటరీ సామర్థ్యం1.5 kWh కాగా, రెండు కలిపి మొత్తం 3.0 kWh బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తాయి. అవసరమైతే బ్యాటరీలను స్కూటర్ నుంచి వేరు చేసి ఇంట్లో లేదా ఇతర చోట్ల సులభంగా ఛార్జ్ చేసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది.

పనితీరు విషయానికి వస్తే, ఈ స్కూటర్ గరిష్టంగా 12.6 bhp (9.4 kW) పవర్తో పాటు 48 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వివిధ రకాల రోడ్ల పరిస్థితులు, రైడింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇందులో ఎకానమీ, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను అందించారు. ఎక్కువ రేంజ్ కావాలనుకునే వారికి ఎకానమీ మోడ్, రోజువారీ వినియోగానికి స్టాండర్డ్ మోడ్, అత్యుత్తమ పనితీరు కోసం పవర్ మోడ్ ఉపయోగపడుతుంది.
పూర్తి ఛార్జ్‌పై IDC ప్రమాణాల ప్రకారం 117 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని యమహా వెల్లడించింది. రోజువారీ నగర ప్రయాణాలకు ఈ రేంజ్ చాలామందికి సరిపోతుందని చెప్పవచ్చు. 1.5 kWh బ్యాటరీని 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 3 గంటల 10 నిమిషాలు పడుతుంది. రెండు బ్యాటరీ ప్యాక్‌లను పూర్తిగా ఛార్జ్ చేయాలంటే సుమారు 6 గంటల 20 నిమిషాలు సమయం అవసరమని కంపెనీ తెలిపింది.

ఫీచర్ల పరంగా ఫుల్-కలర్ TFT డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్, యమహా Y-Connect యాప్ సపోర్ట్, ఆల్-LED లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, రివర్స్ మోడ్, సింగిల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, భద్రతకు ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్‌ను అందించారు. తొలి దశలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై నగరాల్లో విక్రయిస్తారు.







