టాటా పంచ్‌కు భారీ షాక్.. మారుతి నుంచి భారతదేశంలోనే అత్యంత చౌకైన ఎస్‌యూవీ రాబోతుందా?
భారత ఆటోమొబైల్ మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న మారుతి సుజుకి ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న టాటా పంచ్ (Tata Punch) SUVకి గట్టి పోటీ ఇచ్చేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. మిడ్-బడ్జెట్ ధరలో కస్టమర్లను ఆకట్టుకునేలా కంపెనీ ఒక సరికొత్త చిన్న ఎస్‌యూవీని తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ వర్గాల్లో భారీగా చర్చ నడుస్తున్న ఈ అప్‌కమింగ్ కారుకు ‘Y43’ అనే కోడ్‌నేమ్ పెట్టినట్లు సమాచారం. జూన్ 2026లో బెస్ట్ సెల్లింగ్ కారుగా రికార్డు క్రియేట్ చేసిన టాటా పంచ్‌ను ఢీకొట్టడమే లక్ష్యంగా మారుతి సుజుకి ఈ కొత్త మైక్రో SUVని సరికొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరతో భారత మార్కెట్లోకి లాంచ్ చేయనుంది.
బాక్సీ డిజైన్, మోడ్రన్ ఫీచర్లు
లీకైన రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సరికొత్త మారుతి Y43 ఎస్‌యూవీ డిజైన్ చూడటానికి టాల్-బాయ్ (Tall-boy SUV) శైలిలో కాస్త బాక్సీ లుక్‌తో ఉండబోతోంది. ఈ కారు ముందు భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు (Connected LED DRLs), శక్తివంతమైన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, వెనుక వైపు స్టైలిష్ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లను అందించనున్నారు.

కారుకు పక్క వైపు నుంచి పక్కా ఎస్‌యూవీ లుక్ తీసుకురావడం కోసం ఇందులో 16-ఇంచ్ లేదా 17-ఇంచ్ సైజు గల ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్‌ను అమర్చనున్నారు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 9-ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అన్ని రకాల మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.
నాలుగు రకాల ఇంజన్ ఆప్షన్లతో రానున్న మారుతి కొత్త కారు
సాధారణంగా మారుతి సుజుకి కంపెనీ తన కార్లలో ఎక్కువ రకాల పవర్‌ట్రెయిన్ (ఇంజన్) ఆప్షన్లను ఇవ్వదు. కానీ ఈ సరికొత్త Y43 విషయంలో మాత్రం కంపెనీ ఆ రూల్‌ను బ్రేక్ చేయబోతోంది. కస్టమర్ల విభిన్న అవసరాలకు తగ్గట్టుగా ఇందులో ఏకంగా నాలుగు రకాల ఇంజన్ ఆప్షన్లను అందించబోతున్నట్లు సమాచారం.
ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఎక్కువ పవర్ కోరుకునే వారి కోసం 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, మైలేజ్ ప్రియుల కోసం 1.2-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్, అత్యంత తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు 1.2-లీటర్ పెట్రోల్ సిఎన్‌జి (CNG) ఆప్షన్లు ఉండనున్నాయి. ఇన్ని రకాల ఆప్షన్లు ఉండటం వల్ల టాటా పంచ్‌పై మారుతి Y43 స్పష్టమైన ఆధిక్యత సాధించే అవకాశం ఉంది.
సేఫ్టీ విషయంలో తగ్గేదే లే
ప్రస్తుత రోజుల్లో భారతీయ కారు కొనుగోలుదారులు మైలేజ్, ఫీచర్లతో పాటు సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మారుతి సుజుకి ఇటీవల తన సరికొత్త డిజైర్, విటారా, రాబోయే ఈ-విటారా వంటి కార్లలో సేఫ్టీ ప్రమాణాలను భారీగా పెంచింది.
అదే తరహాలో రాబోయే ఈ కొత్త Y43 మైక్రో ఎస్‌యూవీని కూడా అత్యంత సురక్షితమైన, బలమైన ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనున్నారు. ప్రయాణికుల రక్షణ కోసం ఇందులో బేస్ వేరియంట్ నుండే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, కారును ఈజీగా పార్కింగ్ చేయడానికి 360-డిగ్రీ కెమెరా, టైర్లలో గాలి ఒత్తిడిని కనిపెట్టే టిపిఎమ్ఎస్ (TPMS) వంటి భద్రతా ఫీచర్లను జోడించనున్నారు.
భారతదేశంలోనే అత్యంత చౌకైన ఎస్‌యూవీ కాబోతుందా?
ఈ సరికొత్త మారుతి Y43 మైక్రో ఎస్‌యూవీ ఇప్పటివరకు భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో ఎక్కడా కనిపించలేదు. అందువల్ల ఈ కారు లాంచ్ కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆటోమొబైల్ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఎస్‌యూవీ 2027 చివరి భాగంలో లేదా 2028 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక ధర విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర సుమారు రూ.6.25 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు (ఆన్-రోడ్) ఉండవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇదే ధరతో గనుక మార్కెట్లోకి వస్తే.. ప్రస్తుతం దేశంలోనే లభిస్తున్న అత్యంత చౌకైన, బెస్ట్ వాల్యూ ఎస్‌యూవీగా మారుతి Y43 నిలిచిపోవడం ఖాయం.







