HomeNewsదమ్ముంటే రాజీనామా చేద్దాం..!

దమ్ముంటే రాజీనామా చేద్దాం..!

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • ఎన్నికలకు సిద్ధమా?
  • అభివృద్ధిని వదిలి రాజకీయ కొట్లాటలకే ప్రాధాన్యమా?
  • జుంటుపల్లి వెంకట్ వ్యాఖ్యలపై కౌన్సిలర్ల తీవ్ర ఆగ్రహం
  • క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రం

జనవాహిని ప్రతినిధి తాండూరు :పట్టణ మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం స్థానిక రాజకీయాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కౌన్సిల్ వేదికగా ప్రజా సమస్యలను పక్కనబెట్టి, కేవలం అధికార, ప్రతిపక్షాల మధ్య కొట్లాటలు నడుస్తున్నాయే తప్ప పట్టణ అభివృద్ధి గురించి ఎవరూ మాట్లాడటం లేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ కౌన్సిలర్ లు నాగారం మల్లేశం, కిరణ్, శ్రీకాంత్ రెడ్డి లు మాట్లాడుతూ…… ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తమపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన కౌన్సిలర్లను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకుడు జుంటుపల్లి వెంకట్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ అభ్యర్థులు టీఆర్ఎస్‌తో కుమ్మక్కై గెలిచారని మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని బీజేపీ కౌన్సిలర్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ నాయకుల్లాగా ఓటర్లకు భారీగా డబ్బు, మద్యం పంచి అడ్డదారిలో గెలవలేదని, కేవలం ప్రజల హృదయాలను గెలుచుకుని స్వచ్ఛందంగా విజయం సాధించామని బీజేపీ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. తాండూరు పట్టణంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలుగా ఉంటామనే నమ్మకంతోనే వార్డు ప్రజలు తమను ఆదరించి గెలిపించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వ్యక్తిగత సహకారం మరియు అండదండలతోనే గెలిచారనేది జగమెరిగిన సత్యమన్నారు.

నేను నా కౌన్సిలర్ పదవికి రేపే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దమ్ముంటే మీ ఎమ్మెల్యే, మీ మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు కాంగ్రెస్ నాయకులంతా కలిసి రండి, మళ్లీ ఎన్నికలకు వెళ్దాం. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేల్చుకుందాం, ఈ సవాల్‌ను స్వీకరించే ధైర్యం ఉందా?” అని కాంగ్రెస్ శ్రేణులకు సవాల్ విసిరారు. జుంటుపల్లి వెంకట్ రాజకీయ అక్షరాభ్యాసం నేర్చుకున్నదే బీజేపీ పార్టీలోనని, గతంలో మూడుసార్లు బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారని ఎద్దేవా చేశారు. ఈరోజు 19వ వార్డులో రిజర్వేషన్ కలిసి రావడం, ఎమ్మెల్యే దయాదాక్షిణ్యాలతో గెలిచి, ఇవాళ స్వచ్ఛందంగా గెలిచిన బీజేపీపై బురదజల్లడం కరెక్ట్ కాదని హితవు పలికారు. దళిత వర్గానికి చెందిన సదరు నాయకుడు ఆ వర్గానికి ఎలాంటి న్యాయం చేయలేదని, గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు లబ్ధిని కేవలం తన సొంత లబ్ధికే వాడుకున్నారని ఆరోపించారు.తాము సంఖ్యాపరంగా ముగ్గురమే ఉన్నా 33 మంది కౌన్సిలర్లతో సమాన బలం గల కార్యకర్తలు, నాయకులు తమ వెనుక ఉన్నారని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బీజేపీకి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ అరాచకాలను త్వరలోనే ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments