HomeNewsమతిలేని మాటలు మానుకోకపోతే ఖబడ్డార్..!

మతిలేని మాటలు మానుకోకపోతే ఖబడ్డార్..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • పూటకో మాట.. రోజుకో పార్టీ మార్చే వ్యక్తివి
  •  అమరవీరుల కుటుంబాలను మీ నాయకుడు ఏం ఆదుకున్నాడు?
  •  గత ప్రభుత్వ ఉత్తిత్తి మాటలకే ప్రజలు బొంద పెట్టారు.
  • కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్..! 
  •  తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించం

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాజకీయ పెత్తనం కోల్పోయి, మతిలేక, సోయి లేకుండా మాట్లాడుతున్నరు రాజు గౌడ్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూటకో మాట, రోజుకో పార్టీ మారుస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే రాజు గౌడ్‌ను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎన్. వైశాలి రాజు గౌడ్ ఒక ప్రకటనలో అన్నారు. రాజు గౌడ్ రాజకీయ చరిత్ర అంతా అవకాశవాదంతో కూడుకున్నదని మండిపడ్డారు. 1997లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాజు గౌడ్‌కు అప్పటి విషయాలు గుర్తుకు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ జాతిపిత అని రాజు గౌడ్ సంబోధిస్తున్న సదరు నాయకుడు.. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ, పదవులు అనుభవించిన సంగతి తెలంగాణ సమాజానికి తెలియదా? అని ప్రశ్నించారు. 2005లో రాజకీయంగా గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలి బిఆర్ఎస్ లోకి పోయిన కొద్ది రోజులకే.. మళ్లీ ఆంధ్రా పార్టీల పంచన చేరిన చరిత్ర రాజు గౌడ్‌ది కాదా అని నిలదీశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయంగా దిక్కులేకుండా పోతామనే భయంతోనే తిరిగి బిఆర్ఎస్ లోకి చేరిన విషయాన్ని ప్రజలు గమనించారని గుర్తు చేశారు. చాట్ జీపీటీలో చూడండి తెలంగాణ తెచ్చింది ఎవరు అని రాజు గౌడ్ చేసిన వ్యాఖ్యలపై వైశాలి రాజు గౌడ్ కౌంటర్ ఇస్తూ.. ఒక్కసారి అదే సాంకేతికతలో తెలంగాణ ఇచ్చింది ఎవరు? అని చూసుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని చెబుతున్న రాజు గౌడ్.. 2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్న మీ నాయకుడు ఆ అమర వీరుల కుటుంబాలను ఎంతవరకు ఆదుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.గల్లీకో కోటి, గ్రామానికో 50 లక్షలు అంటూ గత ప్రభుత్వం చేసిన ప్రకటనలు, పెట్టిన శిలాఫలకాలు కేవలం నీటి మూటలని, నీటి మీద బుడగల్లాంటివని ప్రజలకు ముందే తెలుసన్నారు. అందుకే గత ఎన్నికల్లో అటువంటి ఉత్తిత్తి మాటలను నమ్మకుండా.. బిఆర్ఎస్ పార్టీకి, వారి నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు తాండూరు నియోజకవర్గ ప్రజలు ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పి నామ్ నిషాన్ లేకుండా చేశారని ఎద్దేవా చేశారు.తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గెలిచిన ఈ కాలంలో నియోజకవర్గంతో పాటు తాండూరు పట్టణంలో ఏమేమి అభివృద్ధి పనులు చేపట్టారో, ప్రజల కోసం ఎలా శ్రమిస్తున్నారో స్థానిక ప్రజలందరికీ బాగా తెలుసని అన్నారు. ఇకనైనా రాజు గౌడ్ మతిలేని మాటలు, సోయిలేని సోదులు మానుకోవాలని హితవు పలికారు. మరోసారి మా ప్రియతమ నాయకుడు మనోహర్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, ఖబడ్డార్ అని వైశాలి రాజు గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments