మే 4 నుంచి జిల్లాలో ‘రైతు వారోత్సవాలు..!

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • తాండూరులో ప్రారంభించనున్న వ్యవసాయ శాఖ మంత్రి
  • హాజరుకానున్న స్పీకర్, జిల్లా ఇంచార్జీ మంత్రి శ్రీధర్ బాబు
  •  భారీ ఎత్తున తరలిరానున్న రైతన్నలు: ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం

జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మే 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు వ్యవసాయ వారం రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ వెల్లడించింది. గురువారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి, ఏఎంసీ చైర్మన్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. మే 4న తాండూరులో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలిపారు. తాండూరు పట్టణంలోని ఎస్విఆర్ ఫంక్షన్ హాల్‌లో సుమారు 1500 మంది రైతుల మధ్య ఈ కార్యక్రమం జరగనుందన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా ఇంచార్జీ మంత్రి శ్రీధర్ బాబు, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు, కొడంగల్ కాడా ప్రత్యేక అధికారి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. మున్సిపల్, ఏఎంసీ చైర్మన్లు, సర్పంచ్‌లు, బీఎఫ్ ఏసీ సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ వారోత్సవాలను విజయవంతం చేసేందుకు వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, నీటి పారుదల, బ్యాంకింగ్, అటవీ మరియు విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయనున్నట్లు వెల్లడించారు.ప్రతి క్లస్టర్ నుండి కనీసం 50 మంది రైతులను ఏఈఓలు (AEO) సభకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్, పట్టు సాగు చేసే రైతులను, పశువైద్య సేవలు పొందే లబ్ధిదారులను మరియు మత్స్యకారులను ప్రత్యేకంగా సమీకరిస్తున్నారన్నారు. కార్యక్రమ ప్రాంగణంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శనలు, స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *