- వాల్మీకి నగర్ వార్డు అభివృద్ధికి రూ. 5 లక్షల నిధుల విడుదల
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
- వార్డు సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా
- కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు వాల్మీకి నగర్ అభివృద్ధికి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మొదటి విడత కింద రూ. 5 లక్షల నిధులను సీసీ రోడ్డు కోసం కేటాయించారాని స్థానిక కౌన్సిలర్ తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
గత మున్సిపల్ ఎన్నికల సమయంలో వాల్మీకి నగర్ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మొదటి విడతగా రూ. 10 లక్షల నిధులు ఇస్తానని ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం రూ. 5 లక్షల నిధులు విడుదల చేశారని, మిగిలిన రూ. 5 లక్షలు కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో మంజూరు కానున్నాయని కౌన్సిలర్ తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ… వాల్మీకి నగర్ వార్డు అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అతి త్వరలోనే తన 23వ వార్డుకు మరిన్ని భారీ నిధులను తీసుకువచ్చి అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కృష్ణ ముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ బండారి, కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డిలతో పాటు వార్డు సభ్యులు, నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
