- మొన్న తాండూరు.. నేడు జహీరాబాద్‌లో చోరీలు
- ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తితో కూడిన ముఠా హల్‌చల్
- తాండూరులో సీసీ కెమెరాలు లేక గుర్తించని పోలీసులు
జనవాహిని ప్రతినిధి తాండూరు; ఉమ్మడి జిల్లాలో పరిధిలోని బంగారం దుకాణాలే లక్ష్యంగా ఒక కిలాడీ ముఠా విరుచుకుపడుతోంది. బురఖాలు ధరించిన ముగ్గురు మహిళలు, టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తితో కూడిన ఈ గ్యాంగ్ వ్యాపారులను మాటల్లో పెట్టి చేతికి దొరికిన బంగారం ఆభరణాలను నైపుణ్యంగా నొక్కేస్తోంది.
దాదాపు 15 రోజుల క్రితం తాండూరు పట్టణంలోని ఓ బంగారం దుకాణంలోకి కస్టమర్లలా ప్రవేశించిన ఈ గ్యాంగ్, షాపు యజమాని దృష్టి మళ్లించి చకచక్యంగా బంగారు గొలుసును దొంగిలించి పరారైంది. ఈ ఘటన జరిగి రెండు వారాలు దాటుతున్నా నిందితుల ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉండగా, సోమవారం అదే ముఠా జహీరాబాద్‌లోని మరో బంగారు దుకాణంలోనూ ఇదే తరహాలో చోరీకి పాల్పడి సురక్షితంగా జారుకోవడం తీవ్ర కలకలం రేపింది.
తాండూరు పట్టణంలో సరైన సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడం వల్లే చోరీ జరిగి ఇన్ని రోజులైనా దొంగలను గుర్తించలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాండూరులో తప్పించుకున్న ఈ ముఠా ఇప్పుడు జహీరాబాద్‌లో మళ్లీ ప్రత్యక్షం కావడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? వీరి వెనుక ఎవరున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయాలని, బంగారం షాపుల యజమానులు అప్రమత్తంగా ఉండాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.