చంద్రబాబుతో మరో కార్యక్రమానికి పవన్ డుమ్మా..! ఏం జరుగుతోంది ?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న మరో అధికారిక కార్యక్రమానికి వరుసగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan kalyan) దూరమయ్యారు. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నివాసం లోక్ భవన్ లో సంప్రదాయంగా జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదని జనసేన పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. తాజాగా అమరావతి లో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో చంద్రబాబుతో పాటు ఆయన పాల్గొనాల్సి ఉండగా.. విశాఖలో ఏనుగుల దినోత్సవానికి వెళ్లడం చర్చనీయాంశమైంది.
ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ తీవ్ర జ్వరం కారణంగా ఈ సాయంత్రం లోక్ భవన్‌లో నిర్వహించే “ఎట్ హోమ్” కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని లోక్ భవన్ అధికారులకు కూడా తెలియజేసినట్లు పేర్కొంది. ఇవాళ ఉదయం కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్నారని తెలిపింది.

రాజమహేంద్రవరంలో డాక్టర్లు పవన్ కళ్యాణ్ ను పరీక్షించారని జనసేన వర్గాలు తెలిపాయి. కొంత ఉపశమనం తర్వాత ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారని తెలిపాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో, తర్వాత చేయించుకోవాల్సిన ఫిజియో థెరపీ గురించీ వైద్య నిపుణుల సూచనల్ని స్వీకరించనున్నారని జనసేన వెల్లడించింది. మరోవైపు తాజాగా అమరావతికి పవన్ రాకపోవడంపై ఆయనవైపు నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచీ కానీ, కూటమి పార్టీల నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. అంతకు ముందు వరుసగా మూడు కేబినెట్ భేటీలకు పవన్ హాజరు కాలేదు. దీంతో కూటమిలో ఏం జరుగుతోందన్న చర్చ నెలకొంది.


