- రోజుకు వందలాది లారీల్లో తరలింపు
- మండిపడుతున్న యాలాల మండల రైతాంగం
- స్పందించకుంటే అమరణ దీక్షకు సిద్ధమని హెచ్చరిక
- బిఆర్ఎస్ నాయకులు సిద్రాల శ్రీనివాస్
జనవాహిని ప్రతినిధి తాండూరు: అది ఒకప్పుడు ఆ ప్రాంత రైతుల నోటి తడి ఆర్పిన జీవధార.. కానీ నేడది కాంట్రాక్టర్లు, దళారుల అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని యాలల మండల నాయకులు అన్నారు. యాలాల మండల కేంద్రంతో పాటు విశ్వనాథ్‌పూర్ గ్రామ సమీపంలో పారుతున్న ‘కక్రవేణి’ నది నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తోడేతపై స్థానిక రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అక్రమ రవాణాను వెంటనే అడ్డుకోవాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వాల్టా చట్టం ప్రకారం గానీ, జియాలజీ సర్వే ప్రకారం గానీ అక్కడ ఎలాంటి ఇసుక రీచ్‌కు అనుమతి లేదని బిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా 20 నుంచి 30 అడుగుల లోతు వరకు తవ్వేస్తూ ఇసుకను తోడేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి శివసాగర్ ప్రాజెక్ట్ కేంద్రంగా రోజుకు దాదాపు 100 లారీల చొప్పున వేలాది లారీల ఇసుకను తరలించారని, ఇప్పుడు కక్రవేణి నదిపై పడ్డారని వాపోయారు ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సమయంలో ఇలా నదిలోని ఇసుకను ఊడ్చేస్తే భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోతాయని రైతులు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల యాలాల, సంగెంఖుర్దు, విశ్వనాథ్‌పూర్, రాఘవాపూర్, దేవనూర్ దుబ్బతాండ, గోరేపల్లి, నాగసముందర్, కమల్‌పూర్ తదితర గ్రామాల ప్రజలకు తాగునీరు కరువవ్వడమే కాకుండా, వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి తమ జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకూ వెనకాడబోమని స్పష్టం చేశారు. ఈ వినతిపత్రం ప్రతులను తాండూరు సబ్ కలెక్టర్, యాలాల తహసీల్దార్‌కు కూడా ఇచ్చినట్టు తెలిపారు.
