- తాండూరు హస్తంలో “పాత కాపుల” అసంతృప్తి జ్వాల
- కష్టకాలంలో జెండా మోసినోళ్లకు దక్కని గుర్తింపు!
- ఇతర పార్టీల నుండి వచ్చినోళ్లకు కార్పెట్ స్వాగతం..
- పాత నాయకులకు పక్కన బెంచ్!
- ‘కట్టార్’ కాంగ్రెస్ నేతల ఆవేదన..
జనవాహిని ప్రతినిధి తాండూరు: కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కంచుకోటగా పేరుగాంచిన తాండూరు నియోజకవర్గంలో ప్రస్తుతం దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న సీనియర్ నాయకుల పరిస్థితి తీసికట్టుగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, పోరాటాలు చేసి, చొక్కాలు చింపుకొని జెండాను నిలబెట్టిన అసలైన కాంగ్రెస్ వాదులను నిలువునా పక్కన పెట్టేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కుర్చీలు కొత్తవారికి.. కుంగుబాటు పాతవారికి!
ఇతర పార్టీల నుంచి ఇటీవల కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి అధిష్టానం ఎంతో మర్యాదగా పెద్ద పీట వేస్తూ పదిలమైన పదవులు ఇస్తుంటే, దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాల కోసం రక్తం చిందించిన పాత నాయకులను మాత్రం ఆమడ దూరంలో ఉంచుతున్నారని సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అసలు తాండూరులో నిజమైన, అసలైన కాంగ్రెస్ నాయకులు ఏ పదవిలో ఉన్నారు?” అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ కట్టార్ కాంగ్రెస్ అని ముద్ర వేసుకున్న నాయకుల పరిస్థితి ప్రస్తుతం ‘గంప కింద కోడిలా’ తయారైంది. పార్టీ పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నా, స్థానిక నాయకత్వం తమను అస్సలు పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశా నిస్పృహల్లో మునిగిపోయారు. పార్టీ కోసం ఇప్పటికీ జెండా మోస్తున్నాం.. కానీ ప్రస్తుత నాయకుల వైఖరిపై మాత్రం నమ్మకం పూర్తిగా పోయింది అని కొందరు సీనియర్లు బహిరంగంగానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే కనీస ధర్మాన్ని కూడా తాండూరులోని పెద్ద నాయకులు పక్కనబెట్టారని ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఆవేదన, రగిలిపోతున్న అసంతృప్తి ఇప్పటికే పార్టీ బడా నాయకుల ముందుకు చేరినప్పటికీ ఎలాంటి మార్పూ రాకపోవడం గమనార్హం. జెండా మోసిన పాత నాయకులను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మున్ముందు పార్టీకి భారీ మూల్యం తప్పదని స్థానిక సీనియర్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
