- తాండూర్ ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌లో సమస్యలు
- మురుగునీటితో విద్యార్థినుల నరకయాతన, ప్రహరీ గోడ లేక భద్రత కరువు
- తక్షణమే పరిష్కరించకుంటే ఆందోళన
- బిఆర్ఎస్వి నాయకుల హెచ్చరిక
జనవాహిని ప్రతినిధి తాండూరు: పట్టణంలోని ఓల్డ్ తాండూర్ ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌లో తీవ్ర సమస్యలు నెలకొన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం బిఆర్ఎస్వి డిమాండ్ చేసింది. శుక్రవారం బిఆర్ఎస్వి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు ఆధ్వర్యంలో నాయకులు నసైర్, అబేద్ తదితరులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా దత్తాత్రేయ రావు మాట్లాడుతూ.. పాఠశాల ఎదుట డ్రైనేజీ మురుగునీరు నిలిచిపోవడం వల్ల విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిపాటి వర్షానికే రోడ్డు జలమయమై పిల్లలు బడికి రాలేని పరిస్థితి దాపురించిందన్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో బాలికల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని, పాఠశాల ప్రధాన రహదారిని సాధారణ రోజుల్లో మూసివేస్తూ, ప్రజాప్రతినిధులు, మంత్రులు వచ్చినప్పుడు మాత్రమే తెరవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు.ఈ సమస్యలన్నింటిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.