- పోలీస్ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వాలి
- తాండూరు బీసీ స్టడీ సెంటర్‌ను వెంటనే పునఃప్రారంభించాలి
- బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు: రాష్ట్రంలో ప్రకటించిన పోలీస్ రిక్రూట్‌మెంట్–2026 ద్వారా 7,437 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం అభినందనీయమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు. అయితే గ్రామీణ ప్రాంత పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా వెంటనే ఉచిత కోచింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ …ఖరీదైన ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో చేరే ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులకు నాణ్యమైన స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, ప్రత్యేక శిక్షణ అందించాలని కోరారు. గతంలో ఎంతోమందికి ఉపయోగపడిన తాండూరు బీసీ స్టడీ సెంటర్ ప్రస్తుతం నిర్వీర్యమైందని, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవ తీసుకుని దానిని వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.రాత పరీక్షలతో పాటు రన్నింగ్, లాంగ్ జంప్ వంటి ఫిజికల్ ఈవెంట్లకు రిటైర్డ్ పోలీస్ అధికారులు, ఫిజికల్ ట్రైనర్లతో ఉచిత శిక్షణ ఇప్పించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి, పోలీస్ ఉద్యోగార్థులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.

