- విద్యుత్, ఆర్ అండ్ బి శాఖల నిర్లక్ష్యంపై మండిపడ్డ సంతోష్ గౌడ్
- ఎమ్మెల్యే గారు మీరెక్కడ? పట్టింపులేదా?
- తాండూరులో ప్రజల ప్రాణాలతో చెలగాటం
- నిద్రమత్తులో ఉన్నతాధికారులు..
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు పట్టణంలో ప్రజా సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నా స్థానిక శాసనసభ్యుడితో పాటు ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్ విమర్శించారు. ఎమ్మెల్యే మీరెక్కడ? ప్రజల ప్రాణాలు పోతేగానీ స్పందించరా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్బంగా అయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ….తాండూరు పరిధిలోని విద్యుత్, రోడ్లు మరియు భవనాల శాఖలు తీవ్ర నిద్రమత్తులో ఉన్నాయని, పట్టణ పౌరుల భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలో ఒక విద్యుత్ స్తంభానికి తీవ్ర స్థాయిలో షార్ట్ సర్క్యూట్ అయిందని, ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ పౌరుడు అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని తెలిపారు. ఇలాంటి ఘటనల తీవ్రతను గుర్తించి విద్యుత్ శాఖ తక్షణమే అన్ని స్తంభాలకు, లైన్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు తాండూరు పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి వాహనదారులకు నరకం చూపుతున్నాయని సంతోష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జి కోసం తవ్విన పెద్ద గుంతలను పూడ్చకుండా వదిలేయడంతో ఇటీవల ఇద్దరు మహిళలు పడి తీవ్ర గాయాలపాలయ్యారని పేర్కొన్నారు.తాండూరు – కొడంగల్ రహదారి పై కనీస హెచ్చరిక బోర్డులు కూడా లేకుండా రోడ్డును తవ్వి వదిలేయడంతో ప్రజలు భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఓ కానిస్టేబుల్ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు స్పందించకపోవడం దారుణమని, వెంటనే ప్రమాదకర గుంతలను పూడ్చి, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సంతోష్ గౌడ్ కోరారు. లేనిపక్షంలో ప్రజల తరఫున బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని, పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

