రెండురోజుల్లో.. శక్తిమంతమైన ఆషాఢ ఏకాదశి: ద్వాదశాక్షరి మహామంత్ర జపించండి
హిందూ ధర్మంలో ఆషాఢ ఏకాదశికి అత్యంత విశిష్ట ప్రాధాన్యత ఉంది. దీన్ని దేవశయని ఏకాదశికిగా కూడా పిలుస్తారు. ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఈ పర్వదినం నుంచే శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఈ పవిత్రమైన రోజు నుంచే చాతుర్మాస వ్రతం ప్రారంభమౌతుంది. ఈ నాలుగు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు, మంగళకర పనులు చేయకుండా కేవలం ఆధ్యాత్మిక సాధనలోనే గడుపాలని పురాణాలు చెబుతున్నాయి.
దేవశయని ఏకాదశి రోజు భక్తిశ్రద్ధలతో శ్రీహరిని ఆరాధిస్తే అనంత పుణ్యఫలాలు లభిస్తాయని ప్రతీతి. ఈ రోజున భక్తులు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు. దేవశయని ఏకాదశి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో పాటించడం వల్ల గత జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, భౌతిక సుఖాలతో పాటు మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ వ్రతాన్ని ఆచరించే సమయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

ఏకాదశి రోజున ఉపవాసం ఉండే భక్తులు సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి. మనసులో స్వామివారిని ధ్యానిస్తూ వ్రత సంకల్పం తీసుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పసుపు రంగు పుష్పాలు, పండ్లు, ధూపదీపాలతో అర్చించాలి. తులసి దళాలతో పూజించడం అవసరం.
పూజా సమయంలో శ్రీహరి అనుగ్రహం కోసం ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ద్వాదశాక్షరి మహామంత్రాన్ని నిరంతరం జపించాలి. ఒకవేళ సంపూర్ణ నిర్జల ఉపవాసం సాధ్యం కాని వారు, తమ శారీరక ఆరోగ్యం, శక్తిని బట్టి పండ్లు, పాలు వంటి ఫలాహారాన్ని తీసుకోవచ్చు. ఆ రోజున దానధర్మాలు చేస్తే మహావిష్ణువు సంతోషిస్తాడని పెద్దలు చెబుతారు. పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల వ్రత ఫలితం రెట్టింపవుతుంది.
ఏకాదశి వ్రత నియమాల ప్రకారం ఈ రోజున కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారం, మద్యం వంటి తామసిక వస్తువుల జోలికి వెళ్లకూడదు. ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బియ్యంతో చేసిన అన్నం వండడం గానీ, తినడం గానీ చేయకూడదు. ఈ నియమాన్ని ఉపవాసం ఉండే వారే కాకుండా ఇంట్లోని మిగిలిన సభ్యులు కూడా పాటించడం చాలా మంచిది.
శారీరక నియమాలతో పాటు మానసిక ప్రవర్తన కూడా ఈ రోజు ఎంతో ముఖ్యం. ఏకాదశి పర్వదినాన ఎవరిపైనా కోపగించుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, కఠిన సంభాషణలకు దూరంగా ఉండాలి. ఎవరినీ మానసికంగా గానీ, శారీరకంగా గానీ హింసించకూడదు. మరుసటి రోజు ద్వాదశి తిథి నాడు శుభ ముహూర్తంలో నియమ నిష్టలతో ఉపవాస పారణ చేయాలి. ఇలా వ్రతాన్ని పూర్తి చేసినప్పుడే స్వామివారి అనుగ్రహం భక్తులకు లభిస్తుంది.

