‘కల్కి 2’కి ఊహించని సవాల్.. కర్ణుడి వివాదం!
‘కల్కి 2898 AD’ సినిమా విడుదలై రెండేళ్లు దాటిన తర్వాత కూడా ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్‌ను కర్ణుడిగా చూపించిన విధానంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అఖిల్ అక్కినేని చిత్రం ‘లెనిన్’ విడుదలయ్యాక కర్ణుడి పాత్రపై సోషల్ మీడియాలో ఈ తాజా చర్చ ప్రారంభమైంది. ‘లెనిన్ సినిమాలో కర్ణుడిని మహాభారతం ప్రకారం పూర్తిగా ప్రతినాయకుడిగా చూపించారని.. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం ‘కల్కి 2’లో కర్ణుడిని అనవసరంగా హీరోగా చూపిస్తూ హిందువుల భావాలను గాయపరిచారని కొందరు నెటిజన్లు ఆరోపించారు.
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సారి మాత్రం ఊరుకోలేదు. విమర్శలకు తగిన సమాధానం ఇచ్చాడు. బిబేక్ దేబ్రాయ్ రాసిన మహాభారత అనువాదంలోని “ద్రోణ వధ పర్వం” నుంచి ఓ పేజీని షేర్ చేస్తూ.. స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో కర్ణుడి పరాక్రమాన్ని ప్రశంసించిన విషయాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ గుర్తు చేశారు. విమర్శలు చేసే ముందు మహాభారతాన్ని పూర్తిగా అధ్యయనం చేసి లేదా కృష్ణుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించారో గూగుల్ చేసిన చూడాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచించారు. “చరిత్రపై నాకు అత్యంత గౌరవం ఉంది. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. పార్ట్-2 వరకు వేచి చూడండి” అంటూ నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.

అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇచ్చిన ఈ సమాధానంపై కూడా నెట్టింట మరో చర్చ మొదలైంది. ఈ చిత్రంలో ఆయన తీసుకున్న కొన్ని క్రియేటివ్ నిర్ణయాలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. అసలు స్టోరీలో అశ్వత్థామను కర్ణుడు కాపాడినట్లు ఎక్కడా లేదని.. కానీ ఈ చిత్రంలో దాన్ని రివర్స్ చేసి చూపించారని కొందరు వాదిస్తున్నారు. అలాగే పాత్రల ఎంపిక గురించి కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ వంటి పాన్-ఇండియా హీరోను కర్ణుడిగా పెట్టి.. ఆయనకు పోటీగా అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ వంటి యువ హీరోను చూపించడం వల్ల అర్జునుడు బలహీనంగా, కర్ణుడు మరింత శక్తివంతంగా కనిపించాడని నెటిజన్లు వాదిస్తున్నారు.
ఈ మార్పుల వల్ల నేటి యువత అర్జునుడి కంటే కర్ణుడే గొప్పవాడనే తప్పుడు అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురాణాల ప్రకారం కాకపోయినా.. ఓ ఫిక్షనల్ స్టోరీగా సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం తప్పు కాదని.. కానీ దానికి మహాభారత శ్లోకాలను జత చేసి సమర్థించుకోవడమే వివాదానికి కారణమవుతోందని మరికొందరు సూచిస్తున్నారు. కల్కి ఫస్ట్ పార్ట్ విడుదలకు ముందు ఎలాంటి వివాదాలు లేనప్పటికీ.. క్లైమాక్స్ చూసిన తర్వాతే ఈ చర్చ తీవ్రరూపం దాల్చింది.
ప్రస్తుతం కల్కి 2 చిత్రం నిర్మాణానికి సిద్ధమవుతోంది. కల్కి మొదటి భాగం తెచ్చిన వివాదం నేపథ్యంలో ఇప్పుడు కల్కి 2కు సంబంధించిన ప్రతి టీజర్, ట్రైలర్, డైలాగ్ లను భూతద్ధంలో పెట్టి చూసే అవకాశం ఉంది. అయితే నాగ్ అశ్విన్ కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఆయన ఈ నెగిటివిటీని తగ్గించేలా ప్లాన్ చేసుకోవచ్చు.