Jr NTR: జూలై 18న జరిగే ఈవెంట్ పేరు ఇదే!
జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అడుగులపై గత కొన్ని రోజులుగా సినీ, పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన నేపథ్యంలో.. ఏపీలో కూడా తారక్ జూలై 18న ఒక భారీ వేదికపై తన అభిమాన సంఘాలను ఏకం చేసి, సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. గతంలో 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేసిన అనుభవం ఉండటం, ఆ తర్వాత అమిత్ షాతో భేటీ కావడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ వార్తలపై ఎన్టీఆర్ టీమ్ ఆదివారం అధికారికంగా స్పందిస్తూ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

అది రాజకీయ ప్రకటన కాదు.. ‘ఊరు వాడ’ పరిచయం!
జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన ఉంటుందంటూ వస్తున్న పోస్టులన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని ఫ్యాన్స్ టీం స్పష్టం చేశారు. ఆ రోజు నిర్వహించ తలపెట్టిన “ఊరు వాడ” ప్రోగ్రామ్ ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం, లక్ష్యం, విజన్‌ను.. ప్రజలకు పరిచయం చేయడానికే మాత్రమేనని, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఊహాగానాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
పుకార్లను నమ్మొద్దు.. త్వరలోనే పూర్తి వివరాలు!
సదరు కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం, పూర్తి కార్యాచరణ వివరాలను త్వరలోనే ఎన్టీఆర్ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటిస్తామని టీమ్ వెల్లడించింది. అదే సమయంలో మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా పేజీలు నిర్ధారణ కాని లేదా అసత్య సమాచారాన్ని ప్రచారం చేయవద్దని వినయపూర్వకంగా కోరారు. వార్తలను పంచుకునే ముందు వాస్తవాలను ఒకసారి నిర్ధారించుకోవడం వల్ల అభిమానుల్లో అనవసరమైన ఆయోమయం ఏర్పడకుండా నివారించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ అభిమానులు, మీడియా మిత్రులు చూపిస్తున్న నిరంతర ఆదరణ, సహకారానికి ఈ సందర్భంగా వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

