- వర్షాలు కురవాలని ఇప్పల పరమేశ్వర ఆలయంలో ‘వడ్ల పాశం’ పూజలు
- ఆలయ ధర్మకర్త పట్లోళ్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో వేడుక
- హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డి, ప్రముఖ నాయకులు
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు పట్టణంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు చల్లగా ఉండాలని కాంక్షిస్తూ సాయిపూర్ ప్రాంత ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిపూర్ సమీపంలోని రాజీవ్ గృహకల్ప దగ్గర వెలిసిన శ్రీ ఇప్పల పరమేశ్వర దేవాలయం లో ఆలయ ధర్మకర్త పట్లోళ్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో స్థానిక కాలనీవాసులు, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో‘వడ్ల పాశం’ కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పరమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించారు. ఎండ తీవ్రత తగ్గి, కరవు కాటకాలు రాకుండా సకాలంలో ప్రకృతి కరుణించి వర్షాలు పడాలని భక్తులతో కలిసి ప్రజాప్రతినిధులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా వడ్ల పాశాన్ని వండి పరమశివునికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజబాల్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్రెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్ బంటు వేణు, 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ ప్రాంత కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.