Akhil Akkineni: మా నాన్న పని రాక్షసుడు.. లెనిన్ కామెంట్స్ వైరల్
Jul 8, 2026 5:35PM

అఖిల్ సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సరికొత్త రూపంలో వస్తున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లెనిన్’. జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్ అక్కినేని ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో అఖిల్ తన పాత్ర గురించి, సినిమా విశేషాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమాలో అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో అఖిల్ మాట్లాడే చిత్తూరు యాస సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ యాసను గుర్తుచేసేలా, ఈ సినిమాలో అఖిల్ తన గొంతును పూర్తిగా మార్చి పక్కా లోకల్ స్లాంగ్‌లో డైలాగులు పలికారు. ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ, చిత్తూరు యాస నేర్చుకోవడం తనకు చాలా పెద్ద సవాల్ అని, కానీ స్క్రీన్‌పై అది చూసినప్పుడు పడ్డ కష్టమంతా మర్చిపోయానని అఖిల్ ఎంతో భావోద్వేగంగా చెప్పారు. అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళ్లాలనే కసితో ఈ మూవీ చేశాను. నాన్నగారు కూడా దగ్గరుండి అన్ని చూసుకోవడంతో పాటు నిర్మాతగా మూవీ విషయంలో ప్రెజర్ పెట్టారు. పని రాక్షసుడు కూడా అని చెప్పాడు
ఈ చిత్రానికి మరో ప్రధాన బలం సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM). థమన్ తన మార్క్ మ్యూజిక్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అఖిల్ నమ్మకంగా చెప్పారు. యాక్షన్ సీక్వెన్స్ మరియు ఎమోషనల్ సీన్లలో థమన్ ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ప్రశంసించారు. దీనికి తోడుగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించడం విశేషం. శ్రీరాంపురం, భారతం మిట్ట వంటి పల్లెటూరి నేపథ్య ప్రపంచాన్ని తన గంభీరమైన స్వరంతో ఎన్టీఆర్ పరిచయం చేయడం సినిమాకు 100 శాతం అదనపు మైలేజ్ తెచ్చిపెట్టిందని, తారక్ అన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అఖిల్ తన కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారంటే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏకంగా 200 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధిస్తుందని గట్టిగా అంచనా వేస్తున్నారు. అఖిల్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ అవుతుందని, సినిమా చూశాక ఎవ్వరూ కూడా ఫ్లాప్ అనే మాట అనలేరని ధీమా వ్యక్తం చేశారు. మలయాళ స్టార్ శివాజీ, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అక్కినేని నాగార్జున స్వయంగా మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. జూలై 10న థియేటర్లలో ఈ మాస్ జాతర ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







