లక్ష్యం నేషనల్స్.. మన సుధీష్ణ రెడీ..!

- జాతీయ క్రికెట్ పోటీలకు సాయి సుధీష్ణ ఎంపిక
- శివపురి (మధ్యప్రదేశ్) వేదికగా జనవరి 1 నుంచి పోటీలు
- భారత జట్టుకు ఎంపిక అవుతుంది అని ఆశభావం
- హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, కోచ్ లు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ గడ్డపై పుట్టిన క్రికెట్ ఆణిముత్యం సాయి సుధీష్ణ శెట్టి ఇప్పుడు జాతీయ స్థాయిలో తన సత్తా చాటడానికి సిద్ధమైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించే అండర్-19 బాలికల జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు సుధీష్ణ ఎంపికై తాండూర్ కీర్తిని జాతీయ వేదికపై నిలబెట్టింది.
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో జనవరి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో సుధీష్ణ తన ప్రతిభను కనబరచనుంది. చిన్ననాటి నుండే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న సుధీష్ణను ఆమె తల్లిదండ్రులు రామ్ బ్రహ్మం – కవిత దంపతులు ఎంతో ప్రోత్సహించారు. తమ కుమార్తె జాతీయ స్థాయికి ఎంపికవడంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తమకు గర్వకారణమని పేర్కొన్నారు. సుధీష్ణలోని నైపుణ్యాన్ని గుర్తించి, ఆమెను మేటి క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో సహారా క్రికెట్ అకాడమీ కీలక పాత్ర పోషించింది. కోచ్‌లు జగన్నాథ్ రెడ్డి, శరత్, మరియు సతీష్ లు ఆమెకు ప్రత్యేక శిక్షణనిచ్చి జాతీయ స్థాయికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వారు సుధీష్ణను అభినందిస్తూ.. “సుధీష్ణలో మంచి ఏకాగ్రత ఉంది, కచ్చితంగా జాతీయ స్థాయిలో రాణించి టీమ్ ఇండియా వైపు అడుగులు వేస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.స్థానిక క్రీడాకారులు, ప్రముఖులు సుధీష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె శివపురిలో అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నారు.




