దేశమంతా ఎదురుచూసిన AI స్మార్ట్ బైక్ వచ్చేసింది.. తొలి డెలివరీలు స్టార్ట్.. ఒక్క ఛార్జ్‌తో 180 కిమీ
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో చాలా మంది తమ రోజువారి అవసరాల కోసం ఈవీలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే సాధారణంగా ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఈవీ బైకుల కంటే ఎక్కువ ఆదరణ లభిస్తుంది. దీనికి ప్రధాన కారణం తగినన్ని ఎలక్ట్రిక్ బైకులు ఎక్కువగా అందుబాటులో లేకపోవడం, అలాగే ధరలు కాస్త అధికంగా ఉండటం. కానీ, ఇటీవలి కాలంలో తయారీదారులు ఈ సెగ్మెంట్‌పై కూడా ఫోకస్ చేయడం కారణంగా మెల్లగా ఈవీ బైకులు కూడా మార్కెట్లోకి అధికంగానే అడుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓబెన్ ఎలక్ట్రిక్ అనే బెంగళూరుకు చెందిన కంపెనీ గత మే నెలలో కొత్త రోర్ ఇవో ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది.
ఈ బైక్ విడుదల అయిన అతి తక్కువ కాలంలోనే వినియోగదారుల నుంచి మెరుగైన స్పందన అందుకుంది. మార్కెట్లోకి వచ్చిన 15 రోజుల్లోనే 25 వేలకు పైగా బుకింగ్‌లను అందుకుంది. తాజాగా దీనికి సంబంధించిన డెలివరీలను బెంగళూరులోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ డెలివరీలు బెంగళూరుకే పరిమితం చేయగా, రాబోయే వారాల్లో దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఉన్న డీలర్‌షిప్‌ల ద్వారా కస్టమర్లకు డెలివరీ చేస్తారు.

దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.1,24,999. పనితీరు విషయానికి వస్తే, దీనిలో 9 kW సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్‌ను ఏర్పాటు చేశారు. ఈ మోటార్ సహాయంతో బైక్ కేవలం 3 సెకన్లలోనే 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు, 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 180 కిలోమీటర్లు వెళ్లొచ్చు.
దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. దీంతో బ్యాటరీని కేవలం 90 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్‌లో స్మార్ట్ ఐక్యూ ఏఐ టెక్నాలజీని అందించారు. ఈ వ్యవస్థ రైడింగ్ విధానాన్ని పరిశీలించి, ఒక్కో ఛార్జ్‌పై ప్రయాణించే దూరాన్ని దాదాపు 15 శాతం వరకు పెంచడంలో సహాయపడుతుందని కంపెనీ పేర్కొంటోంది. అంతేకాకుండా, ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ను అందించడం కూడా దీని ప్రత్యేకతగా నిలుస్తోంది.

అలాగే,పలు లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లను అందించారు. ఇందులో 5-అంగుళాల TFT డిస్‌ప్లేతో పాటు OTA (ఓవర్-ది-ఎయిర్) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, జియో-ఫెన్సింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్ వంటి కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే బైక్ ప్రమాదవశాత్తు కింద పడిపోయినప్పుడు ఎమర్జెన్సీ హెచ్చరికను పంపించే వ్యవస్థతో పాటు, ఆర్గస్ కనెక్టెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఇందులో పొందుపరిచారు.
మరో విషయం ఏమిటంటే, వినియోగదారులకు మరింత నమ్మకాన్ని కలిగించేలా 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీని కూడా కంపెనీ అందిస్తోంది. ఇంకా కొనుగోలు అనంతర సేవలు పొందేందుకు ఓబెన్ ప్రస్తుతం 18 రాష్ట్రాల్లోని 90కి పైగా నగరాల్లో ప్రత్యేక సర్వీస్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, బైక్‌కు అవసరమైన కీలక భాగాలను ఎక్కువగా సంస్థ స్వయంగా తయారు చేస్తుండటంతో విడిభాగాల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా ఓబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకురాలు, సీఈఓ మధుమిత అగర్వాల్ మాట్లాడుతూ, భారత టూవీలర్ మార్కెట్‌లో బైక్‌ల వాటా 65 శాతానికి మించి ఉందని తెలిపారు. తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణానికి మేలు చేసే రవాణా మార్గాలపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైకుల డిమాండ్ మరింత పెరుగుతోందన్నారు. అలాంటి సమయంలో రోర్ ఎవో డెలివరీలను ప్రారంభించడం కంపెనీకి ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.







