Home News కౌన్సిలర్ కొడుకుకు అక్కడ ఏం పని…!

కౌన్సిలర్ కొడుకుకు అక్కడ ఏం పని…!

1226
0
  • తాండూరు 25వ వార్డులో వింత ఘటన
  •  కౌన్సిలర్ గైర్హాజరు.. కొడుకు పెత్తనంపై స్థానికుల ఆగ్రహం
  • అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక

జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ కార్యక్రమం తాండూరు పట్టణంలో వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధికి బదులు ఆమె కుమారుడు పెత్తనం చలాయించడం చర్చనీయాంశమైంది. బాధ్యతాయుతమైన అధికారిక కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.గురువారం 25వ వార్డు పరిధిలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత వార్డు కౌన్సిలర్ హాజరుకావాల్సి ఉండగా, ఆమె గైర్హాజరయ్యారు. అయితే, ఆమె స్థానంలో ఆమె కుమారుడు హాజరై, అధికారిక వ్యవహారాల్లో తలదూర్చడం గమనార్హం. ఎటువంటి పదవి లేని వ్యక్తి, ప్రభుత్వ కార్యక్రమంలో అధికారికంగా ఎలా పాల్గొంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వాన్ని, ప్రజాపాలన లక్ష్యాన్ని తప్పుదోవ పట్టించడమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ తంతు అంతా అధికారుల కళ్లముందే జరుగుతున్నా, వారు మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు ప్రోటోకాల్‌ను గాలికొదిలేసి, ప్రైవేటు వ్యక్తుల జోక్యాన్ని ఎలా అనుమతిస్తారని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలను అతిక్రమించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వార్డు ప్రజలు తెలిపారు. ప్రజాపాలనలో చోటుచేసుకున్న ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పారదర్శకత ఉండాలని, ఇలాంటి వారసత్వ పెత్తనాలను సహించేది లేదని వారు స్పష్టం చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here