HomeNewsగులాబీ దళంలో ‘నాయకత్వ’ సంక్షోభం..! 

గులాబీ దళంలో ‘నాయకత్వ’ సంక్షోభం..! 

  • రథసారథి లేని ప్రయాణమా..? అయోమయంలో కేడర్
  • రిమాండ్‌లో రోహిత్ రెడ్డి.. సస్పెన్షన్ వేటు తప్పదా..?
  • మళ్ళీ తెరపైకి పట్నం మహేందర్ రెడ్డి పేరు.. పుకార్ల షికారు
  •  నియోజకవర్గంలో బిఆర్ఎస్ భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ..! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : ఒకప్పుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తాండూరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు అంతుచిక్కని మౌనం ఆవరించింది. పార్టీని ముందుండి నడిపించే ‘రథసారథి’ కరువయ్యాడనే చర్చ సామాన్య కార్యకర్త నుండి అగ్రనేతల వరకు జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిమాండ్ పర్వం పార్టీ శ్రేణులను కోలుకోలేని దెబ్బ తీయగా, ఇప్పుడు తాండూరులో గులాబీ జెండా పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

నాయకుడు లేని లోటు.. కార్యకర్తల ఆవేదన

ఎల్లప్పుడూ కార్యకర్తలతో కళకళలాడే పార్టీ కార్యాలయాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. తమ నాయకుడు రోహిత్ రెడ్డి చుట్టూ ముసురుకున్న వివాదాలు, ఆయన రిమాండ్‌కు వెళ్లడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. “మా కష్టసుఖాలు వినేవారెవరు? పార్టీని ముందుకు తీసుకెళ్లేది ఎవరు?” అంటూ క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుండటంతో, ప్రత్యర్థి పార్టీలు “తాండూరులో బిఆర్ఎస్ పని అయిపోయింది” అంటూ చేస్తున్న ప్రచారం కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది.

సస్పెన్షన్ వేటు..? అధిష్టానం కఠిన నిర్ణయం

పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలతో రోహిత్ రెడ్డిపై బిఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా, పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అతి త్వరలోనే ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే జరిగితే తాండూరులో బిఆర్ఎస్ పగ్గాలు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

పట్నం రాకపై జోరుగా పుకార్లు

ఈ సంక్షోభ సమయంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆయన తిరిగి బిఆర్ఎస్ గూటికి చేరుతారని, తాండూరు పగ్గాలు చేపడతారని తాండూరు ప్రాంతం లో పుకార్లు షికారు చేస్తున్నాయి. పాత పరిచయాలు, బలమైన కేడర్ ఉన్న పట్నం వస్తేనే పార్టీ నిలబడుతుందని ఒక వర్గం భావిస్తుంటే, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

భవిష్యత్తుపై సందిగ్ధం

రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న తాండూరులో బిఆర్ఎస్ మనుగడ ఇప్పుడు క్లిష్టదశలో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహం ఉన్నప్పటికీ, సరైన నాయకత్వం లేకపోతే ఆ బలాన్ని కాపాడుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయోమయంలో ఉన్న పార్టీ వర్గాలకు అధిష్టానం ఎలాంటి భరోసా ఇస్తుందో వేచి చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments