– అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్న అధికారులు
– ప్రజా సమస్యలు, ఆక్రమణల ఫిర్యాదుల బుట్టదాఖలు
– తాండూరులో గాడితప్పిన పాలనపై మండిపడుతున్న బిఆర్ఎస్, బీజేపీ నేతలు
జనవాహిని ప్రతినిధి, తాండూరు:సాధారణంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు క్షేత్రస్థాయి సమస్యలపై లేదా అక్రమాలపై గళమెత్తితే అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడం పరిపాటి. కానీ, తాండూరు పురపాలక, రెవెన్యూ శాఖల పరిధిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది. ప్రతిపక్ష నాయకులు ఎంతగా మొత్తుకున్నా, ఎన్ని ఆందోళనలు చేపట్టినా స్థానిక అధికారులు మాత్రం మీరు ఎంత మొరిగినా.. మా పని మేమే చేసుకుంటాం అనే ధోరణిలో వ్యవహరిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తాండూరు పట్టణంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలైన బిఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆధారాలతో సహా వినతిపత్రాలు సమర్పిస్తున్నప్పటికీ అధికారులు వాటిని కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో ప్రతిపక్ష నాయకులు ఇచ్చే ఫిర్యాదులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప, వాటిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని స్పష్టమవుతోంది. అక్రమాలు జరుగుతున్నాయి అడ్డుకోండి మహా ప్రభో అని నిరసన తెలిపిన, అక్కడ ఏమీ జరగడం లేదే అంటూ అధికారులు దొంగ సమాధానాలు చెప్తూ తప్పించుకుంటున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని తమ వార్డుల్లో కనీసం వీధిదీపాలు వేయాలన్నా, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలన్నా ప్రతిపక్ష కౌన్సిలర్లు, నాయకులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోంది. అధికార పార్టీకి చెందిన నాయకుల మాటలకే ప్రాధాన్యం ఇస్తూ, ప్రతిపక్షాల వార్డుల పట్ల అధికారులు పూర్తి పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తాండూరు మున్సిపల్, రెవెన్యూ అధికారుల తీరుపై నిఘా పెట్టాలని, వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించాలని బిఆర్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
