- ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
- బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఆర్థిక సాయం అందించాలి
- అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు; పాత తాండూరులోని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను గురువారం తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ అధికారులతో పాటు కాంట్రాక్టర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, కేటాయించిన గడువులోనే పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బ్రిడ్జి నిర్మాణంలో ఇండ్లు, ఆస్తులు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్లతో పాటు ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక సాయాన్ని త్వరితగతిన అందిస్తామని హామీ ఇచ్చారు.
పాత తాండూరు ప్రజల సూచనలకు అనుగుణంగా, ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాల తొలగింపు పనులను శాఖల సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే పట్టణంలో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్యతో పాటు, రైల్వే గేట్ వద్ద వాహనాల నిలిచివేతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
