HomeEntertainmentలేడీ సూపర్ స్టార్‌కు డబుల్ టెన్షన్!

లేడీ సూపర్ స్టార్‌కు డబుల్ టెన్షన్!

Nayanthara: ఇటీవల ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించిన అనంతరం లేడీ సూపర్ స్టార్ నయనతార.. యశ్ హీరోగా తెరకెక్కిన ‘టాక్సిక్’, ‘హాయ్’ అనే రెండు సినిమాలతో తిరిగి వస్తోంది. ఈ రెండు సినిమాలు వచ్చే వారం థియేటర్లలో విడుదల కానున్నాయి. ‘టాక్సిక్’ ఆగస్టు 26న, ‘హాయ్’ ఆగస్టు 28న విడుదల కానున్నాయి.

యశ్ నటించిన ‘ టాక్సిక్’ చిత్రంలో చాలా మంది హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తూ భారీ తారాగణం ఉన్నప్పటికీ.. ఇటీవల విడుదలైన ట్రైలర్ తర్వాత ఈ సినిమాలో నయనతారకు ప్రముఖ పాత్ర ఉందని చాలా మంది నమ్ముతున్నారు.భారత చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవేటెడ్ మూవీలలో ఒకటైన ‘టాక్సిక్’ దాదాపు 6 నుంచి 7 భాషల్లో ఒకే తేదీన విడుదలవుతుండగా.. మరోవైపు హీరో కవిన్‌తో కలిసి కథానాయికగా నటించిన నయనతార మరో చిత్రం ‘హాయ్’పై కోలీవుడ్ ప్రేక్షకులలో పెద్దగా ఆసక్తిని కలిగించడం లేదు.

నయనతార స్వయంగా తన రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై ‘హాయ్’ చిత్రాన్ని నిర్మించి, ప్రస్తుతం ఈవెంట్లలో పాల్గొంటూ.. ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచారం చేస్తున్నప్పటికీ, ఈ చిత్రానికి ఇంకా విడుదలకు ముందు బలమైన ఊపు రాలేదు.’హాయ్’ సినిమాపై సందడి తక్కువగా ఉండటంపై వాణిజ్య నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఇటీవల విడుదలైన కోలీవుడ్ చిత్రాల వెల్లువ, దానికి తోడు రాబోయే నెలల్లో విడుదల కానున్న అనేక భారీ బడ్జెట్ చిత్రాల కారణంగా, ప్రస్తుతం కోలీవుడ్ మార్కెట్ కిక్కిరిసిపోయినట్లుగా ఉంది. ఫలితంగా, మధ్యస్థ బడ్జెట్ చిత్రాలపై ప్రేక్షకులు పెద్దగా ఉత్సాహం చూపడం లేదు.

అంతేకాకుండా యశ్ పాన్-ఇండియన్ చిత్రం ‘టాక్సిక్’ అదే వారంలో విడుదల అవుతున్నందున ప్రజల దృష్టి కేవలం దానిపైనే కేంద్రీకృతమై ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘టాక్సిక్’ వంటి పాన్-ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న వేళ.. రెండ్రోజుల వ్యవధిలోనే వస్తున్న ‘హాయ్’ చిత్రానికి తగినన్ని స్క్రీన్లు దక్కడం సవాలుగా మారవచ్చు. ‘టాక్సిక్’ సినిమాకు థియేటర్లలో విపరీతమైన ఆదరణ లభిస్తే.. ఆ భారీ హవాలో ‘హాయ్’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడే ప్రమాదముందని వాణిజ్య విశ్లేషకులు భావిస్తున్నారు.

వచ్చే వారం రెండు సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో, నయనతార చిత్రాలలో ఏది విజేతగా నిలుస్తుందో, అలాగే తమిళనాడు బాక్సాఫీస్‌ వద్ద ‘టాక్సిక్’, ‘హాయ్’ చిత్రాలు ఎలా రాణిస్తాయో వేచి చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments