- తాండూరు గురుకులంలో ర్యాగింగ్‌పై నిష్పక్షపాత విచారణ జరపాలి
- హాస్టల్ ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
- విద్యార్థులతో పనులు చేయించడంపై బీసీ సంఘం ఆగ్రహం
తాండూరు జనవాహిని ప్రతినిధి: తాండూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల హాస్టల్‌లో జరిగిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ సంఘం ప్రతినిధుల బృందం గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య జరిగింది సాధారణ గొడవ మాత్రమేనని కొందరు చెబుతున్నప్పటికీ, తన కుమారుడిని గత కొంతకాలంగా వేధిస్తున్నారని గాయపడిన విద్యార్థి తల్లి ఆరోపిస్తుండటం గమనార్హమన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో ర్యాగింగ్ జరిగిందా లేదా అనే అంశంపై ప్రత్యేక విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్‌లో ఇటువంటి పరిస్థితులకు గల కారణాలపై విచారించాలని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయా అనే కోణంలో తనిఖీలు చేపట్టాలని కోరారు.
విద్యార్థుల రక్షణ, భద్రతకు ప్రిన్సిపాలే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఒకవేళ నిర్లక్ష్యం వహించినట్లు తేలితే ప్రిన్సిపాల్‌తో పాటు సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థులతో వంటగదిలో చపాతీలు చేయించడం ఏంటని ప్రశ్నించారు. అలా పనులు చేయించడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా అని నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులతో వెట్టిపనులు చేయించిన వారిపై కూడా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, ప్రేమ్ కుమార్, యాలాల మండల అధ్యక్షుడు లక్ష్మణాచారి, వడ్డెర సమాజం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్, పర్మేష్, దుబాయ్ వెంకట్, కిరణ్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బశ్వరాజ్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.