– ప్రైవేట్ ట్రస్ట్‌కు 200 ఇళ్లు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటి?
– టోకెన్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు
– కౌన్సిలర్ రూపా రుద్రుపాటిల్ ధ్వజమెత్తు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని పేద ప్రజలకు దక్కాల్సిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం పేదల ఇళ్లను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్ నాయకురాలు, తాండూరు మున్సిపల్ 36వ వార్డు కౌన్సిలర్ రూపా రుద్రుపాటిల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూరులోని డబుల్ బెడ్‌రూమ్ బ్లాకుల్లో ఏకంగా రెండు లైన్లను సుమారు 200 ఇళ్లు జిఎంకే ట్రస్ట్‌కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరెక్కడా లేని ఈ వింత పోకడ కేవలం తాండూరులోనే ఎందుకు జరుగుతోందని ఆమె ప్రశ్నించారు. “ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్లను ఒక ప్రైవేట్ ట్రస్ట్‌కు ఏ అధికారంతో అప్పగిస్తారు? అసలు ఆ ట్రస్ట్‌కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి?” అని ఆమె నిలదీశారు.డబుల్ బెడ్‌రూమ్ ఇప్పిస్తామంటూ ట్రస్ట్ ద్వారా టోకెన్లు పంపిణీ చేస్తూ సామాన్య ప్రజలను మభ్యపెడుతున్నారని రూపా రుద్రుపాటిల్ మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా పంపిణీ చేయాల్సిన ఇళ్లను, ఇలా ట్రస్ట్ పేరుతో అందజేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇది కేవలం పేదలను వంచించడమేనని, ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అర్హులైన నిరుపేదలకు అందాల్సిన ఇళ్లను కాంగ్రెస్ నాయకులు అమ్ముకుంటున్నారని, సొంత కేడర్‌కు ఇచ్చుకుంటూ అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్ట్‌కు కేటాయించిన 200 ఇళ్ల వెనుక పెద్ద ఎత్తున మతలబు దాగి ఉందని విమర్శించారు. తక్షణమే ఈ కేటాయింపులను రద్దు చేసి, రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేద ప్రజల తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.




