- సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు
- టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే హోమ్ టేక్ రేషన్ సరుకుల పంపిణీలో అంగన్వాడీ టీచర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మే నెల ముగుస్తున్నా, లబ్ధిదారులకు అందాల్సిన సరుకులు ఇప్పటికీ చేతికి అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా బియ్యం, కందిపప్పు, వంటనూనె, బాలామృతం వంటి పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, అన్నసాగర్ కేంద్రంలో టీచర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, సకాలంలో సరుకులు అందజేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనివల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు.పలుమార్లు అడిగినా సరుకులు అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న టీచర్ తీరుపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సదరు టీచర్‌పై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి, విధుల నుంచి తొలగించాలని అన్నసాగర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత సిడిపిఓ అధికారులు స్పందించి, లబ్ధిదారులకు పంపిణీ సజావుగా సాగేలా చూడాలని వారు కోరుతున్నారు.




