- స్టేట్ లెవల్ క్రికెట్‌కు తాండూరు ఆణిముత్యం ఎంపిక
- రైతు బిడ్డ చైత్రారెడ్డికి దక్కిన అరుదైన గౌరవం
- అభినందించిన స్పాన్సర్ లొంకా నర్సింలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : లక్ష్యంపై గురి ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఆ విద్యార్థిని. పొలంలో పని చేసే తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆమె, ఇప్పుడు రాష్ట్ర స్థాయి క్రికెట్ పిచ్‌పై బ్యాట్ ఝుళిపించేందుకు సిద్ధమైంది. పెద్దేముల్ మండలం గిర్మపూర్ గ్రామానికి చెందిన పి. రామ్ రెడ్డి, స్వాతి దంపతుల కుమార్తె చైత్రారెడ్డి, ఎస్జిఎఫ్ఐ బాలికల అండర్-17 తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించింది.మల్రెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చైత్రారెడ్డి, స్థానిక హనుమాన్ ఫంక్షన్ హాల్ సమీపంలోని లెజెండ్ క్రికెట్ అకాడమీలో కోచ్ లు సాయిల్,సోహెల్ వద్ద గత మూడేళ్లుగా మెళకువలు నేర్చుకుంటోంది. నిత్యం కఠినమైన సాధన చేస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్ర స్థాయికి చేరుకుంది. ఈ నెల 29నా హర్యాలో జరగబోయే పోటిల్లో పాల్గొంటుంది. అక్కడ కూడా మంచి ప్రతిభను కనబరుచి జాతీయ స్థాయిలో రానించాలని కోచ్ లు, తల్లిదండ్రులు, క్రీడాకారులు కోరారు. చైత్రారెడ్డి ప్రతిభను గుర్తించి ఆమెకు వెన్నుదన్నుగా నిలుస్తున్న స్పాన్సర్ లొంకా నర్సింలు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇలాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తే దేశానికి గర్వకారణంగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. తమ గ్రామానికి చెందిన అమ్మాయి రాష్ట్ర జట్టుకు ఎంపికవ్వడం పట్ల గిర్మపూర్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.




