Thursday, May 28, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSఅమ్మ దీవెనలే ఆఖరి మాటలయ్యాయి..!

అమ్మ దీవెనలే ఆఖరి మాటలయ్యాయి..!

spot_img
  • పుట్టినరోజు నాడే కన్నతల్లి మృతి..
  • కుమారుడి ఆర్తనాదంతో మిన్నంటిన రోదనలు
  • అమ్మ ఇక రాదని తెలిసి.. ఆ పసి హృదయాలు విలవిల!
  • మృత్యువుతో పోరాడుతూనే కొడుకును దీవించిన తల్లి!

జనవాహిని ప్రతినిధి,తాండూరు : “నూరేళ్లు చల్లగా ఉండు నాయనా..” అంటూ ఉదయం ఏ చేతులతో అయితే దీవించిందో.. అదే సాయంత్రం ఆ తల్లి విగతజీవిగా మారింది. కేక్ కోసి సంబరాలు చేసుకోవాల్సిన పిల్లాడు.. కన్నతల్లి చితికి నిప్పు పెట్టాల్సి వచ్చింది. మద్యానికి బానిసైన ఓ తండ్రి రాక్షసత్వం.. పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.యాలాల మండలం చెన్నారం గ్రామానికి చెందిన జటంగి దేవి (33) కథ ఇది. భర్త హన్మంతు తాగుడుకు బానిసై నిత్యం వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన ఆమె, ఈ నెల 13న గడ్డిమందు తాగింది. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సమయంలోనే మంగళవారం ఆమె కుమారుడు అభిలాష్ పుట్టినరోజు వచ్చింది. ఆసుపత్రి బెడ్‌పై చావు బతుకుల మధ్య ఉన్నా, తన బిడ్డను చూడగానే ఆ తల్లి కళ్లు మెరిశాయి. ‘వందేళ్లు వర్ధిల్లాలి బిడ్డ’ అని నిండు మనసుతో ఆశీర్వదించింది. అమ్మ త్వరలోనే ఇంటికి వస్తుందని ఆశపడ్డ ఆ బాలుడికి, సాయంత్రానికే అమ్మ శాశ్వతంగా దూరమైందన్న వార్త పిడుగులా తగిలింది.బుధవారం జరిగిన అంత్యక్రియల్లో దృశ్యం చూసి ఊరంతా కన్నీరు పెట్టింది. 13 ఏళ్ల అభిలాష్ తన తల్లికి తలకొరివి పెడుతుంటే, పదేళ్ల చెల్లెలు పున్నమి అమ్మ కోసం ఏడుస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. “ఉదయం నన్ను దీవించావు కదమ్మా.. ఇప్పుడే ఎందుకు వెళ్లిపోయావు?” అంటూ ఆ బాలుడు చేసిన ఆర్తనాదాలు అంబరాన్నంటాయి.దేవి మరణానికి భర్త వేధింపులే కారణమని పోలీసులు తేల్చారు. తాగుడుకు బానిసై, అప్పుల బాధతో భార్యను వేధించడమే కాకుండా, పుట్టింటి నుండి డబ్బులు తేవాలని ఒత్తిడి చేసేవాడని విచారణలో తేలింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు యాలాల ఎస్సై విఠల్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అమ్మ దీవెనలే ఆఖరి మాటలవుతాయని ఆ పిల్లాడు ఊహించలేదు. మద్యం మహమ్మారి ఒక నిండు ప్రాణాన్ని తీయడమే కాకుండా, ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును అంధకారం చేసింది.