- నిబంధనలు బేఖాతరు..
- భాష్యం’ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
- తల్లిదండ్రులపై దుర్భాషలు …
- అధికారుల పర్యవేక్షణ కరవు
- ఏబీవీపీ నగర అధ్యక్షులు నరసింహులు డిమాండ్
జనవాహిణి ప్రతినిధి తాండూరు : ప్రభుత్వ నియమ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి, ఆదివారం సెలవు రోజున కూడా దర్జాగా తరగతులు నిర్వహిస్తున్న భాష్యం కళాశాల యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నగర అధ్యక్షులు నరసింహులు డిమాండ్ చేశారు. ఆదివారం సెలవు రోజున కళాశాల నిర్వహించడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు కాలేజీని ముట్టడించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ.. వారంలో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కోసం వచ్చే ఒక్కరోజు సెలవును కూడా భాష్యం కళాశాల యాజమాన్యం వ్యాపార ధోరణితో పనిదినంగా మార్చేసిందని మండిపడ్డారు. ‘సంకల్ప్’ పేరుతో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకపోయినప్పటికీ, పరీక్షల నెపంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇంత బహిరంగంగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా, స్థానిక ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారులను మేనేజ్ చేస్తూ కాలేజీని ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సెలవు రోజున క్లాసులు నిర్వహించడాన్ని ప్రశ్నించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాల కరస్పాండెంట్ దుర్భాషలాడుతూ, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దుర్మార్గమన్నారు. తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, వాగ్వాదానికి దిగడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇలాంటి అహంకారపూరిత చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల దోపిడీని ఎండగడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు స్పందించి సదరు విద్యాసంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్, నాయకులు నవీన్ గౌడ్, జాఫర్, భరత్, కార్తీక్, కౌతిఫ్ తదితరులు పాల్గొన్నారు.