- 24 క్యారెట్ల ధర వసూలు.. 20 క్యారెట్ల బంగారం విక్రయం!
- జీపీ జువెలర్స్ మోసంపై ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు
- జీఎస్టీ లేకుండా సాదా బిల్లులతో వ్యాపారం.. చర్యలకు డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు:ఖాతాదారులను నమ్మించి, తప్పుడు ప్యూరిటీతో బంగారు నగలు విక్రయించి మోసానికి పాల్పడుతున్న జువెలరీ షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వికారాబాద్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. తాండూరుకు చెందిన బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై జిల్లా పోలీసు బాస్ శరణు వేడారు.తాండూరు పట్టణంలోని మురుషాద్ దర్గా ప్రాంతానికి చెందిన ఎండి. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి, గత మే 26న స్థానిక సరాఫ్ బజార్‌లోని ‘జీపీ జువెలర్స్ (గంగిమల్ల పద్మాకర్ జువెలర్స్)’ దుకాణంలో మహిళలకు సంబంధించిన 3 గ్రాముల బంగారు టాప్స్ కొనుగోలు చేశారు. ఆ సమయంలో షాప్ యజమాని 24 క్యారెట్ల బంగారానికి ఉన్న ధరను లెక్కగట్టి, మేకింగ్ ఛార్జీలతో కలిపి మొత్తం రూ. 46,050 వసూలు చేశారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీఎస్టీ బిల్లు ఇవ్వకుండా, దుకాణం పేరు ఉన్న ఒక సాదా కాగితంపై బిల్లు మాత్రం ‘22 క్యారెట్లు’ అని రాసి బాధితుడికి అప్పగించారు.ఇటీవల సదరు బాధితుడికి అత్యవసరంగా డబ్బులు అవసరం పడటంతో ఆ నగలని అమ్మడానికి వేరే దుకాణానికి వెళ్ళాడు. అక్కడ అది 24 క్యారెట్ల బంగారం కాదని తేలింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు హైదరాబాద్‌లోని అధికారిక గోల్డ్ టెస్టింగ్ సెంటర్‌లో ఆ నగల నాణ్యతను పరీక్షించారు.అక్కడే బాధితుడికి షాక్ తినే నిజం బయటపడింది. ఆ నగలు కేవలం 20 క్యారెట్ల ప్యూరిటీ మాత్రమే ఉన్నట్లు ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఇలా 24 క్యారెట్ల ధర వసూలు చేసి.. 20 క్యారెట్ల బంగారం ఇచ్చి తనను దారుణంగా మోసం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మోసంపై గతంలో తాండూరు పట్టణ పోలీసు స్టేషన్ లో మే 5న, అలాగే జూన్ 24న రెండుసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆరోపించారు. తాండూరులో ఇలాంటి నకిలీ బంగారు దందా, ప్యూరిటీ మోసాలు ఎక్కువవుతున్నాయని, ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి సదరు జువెలరీ షాప్ యజమానిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు టిప్పు సుల్తాన్ విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుతో పాటు గోల్డ్ టెస్టింగ్ రిపోర్టును, దుకాణదారుడు ఇచ్చిన సాదా బిల్లును ఎస్పీకి అందజేశారు.