ఒళ్లు గగుర్పొడిచే మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ
డిజిటల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న డిమాండే వేరు. స్క్రీన్ మీద సీన్ మారేకొద్దీ గుండె వేగం పెంచే కథలను చూసేందుకు మూవీ లవర్స్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. సరిగ్గా అలాంటి భయానకమైన, ఉత్కంఠభరితమైన అనుభూతిని పంచడానికి ఓటీటీలోకి అడుగుపెట్టింది ‘త్రికాల’. మాస్టర్ మహేంద్రన్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్, థియేటర్లలో అలరించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.
అన్ని ఓటీటీల్లో
సాధారణంగా ఏదైనా సినిమా ఒకే ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవ్వడం చూస్తుంటాం, కానీ ఈ సినిమా క్రేజ్ ఊహించని స్థాయికి చేరింది. మొదట సన్ నెక్స్ట్ వేదికగా విడుదలై భారీ వ్యూయర్‌షిప్ సాధించడంతో, కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఒకేసారి మూడు దిగ్గజ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వచ్చి, తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోవడం విశేషం.

తరతరాలుగా వెంటాడుతున్న శాపం
ఒక రాజవంశాన్ని తరతరాలుగా వెంటాడుతున్న భయంకరమైన శాపం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ వంశంలో పుట్టిన వైతరణ్ అనే వ్యక్తికి పుట్టుకతోనే సూర్యరశ్మిని చూడలేని వింత సమస్య ఉంటుంది. చీకటి గదికే పరిమితమైన అతనికి వయసు పెరిగేకొద్దీ తీవ్రమైన సైకలాజికల్ బైపోలార్ డిజార్డర్ ఎదురవుతుంది. అతనికి చికిత్స అందించేందుకు సైకియాట్రిస్ట్ డాక్టర్ మాయ రంగంలోకి దిగుతుంది. మరోవైపు శివ, నిధిల ప్రశాంతమైన జీవితాల్లోకి ఊహించని అదృశ్య శక్తులు ప్రవేశిస్తాయి. శంకరపల్లి పురాతన కాటేరమ్మ గుడికి, ఈ రాజకుటుంబానికి ఉన్న లింక్ ఏంటి, దుష్టశక్తులను అంతం చేసే ‘త్రికాల వర్మ’ ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎం
దర్శకుడు మణి తెల్లగూటి ప్రతి క్షణం ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘యానిమల్’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాల సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన భయానకమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే శ్రద్ధా దాస్ ఇందులో డాక్టర్ మాయగా నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించగా, మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని తమ పాత్రలతో మెప్పించారు. కళ్లు చెదిరే విజువల్స్‌తో సాగే ఈ చిత్రం వీకెండ్‌లో ప్రాపర్ హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్.