కంపెనీకి శాపంగా మారిన కారు.. 6 నెలల్లో ఆరు.. 30 రోజుల్లో ఒక్క కారు కూడా అమ్ముపోలేదు
భారత ఆటోమొబైల్ మార్కెట్ రోజురోజుకూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. SUV కార్లకు దేశంలో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) ఇండియాకు గత జూన్ నెల మిశ్రమ ఫలితాలను అందజేసింది. జూన్ నెలలో కంపెనీ మొత్తం మోడళ్లపై 610 కార్లను విక్రయించి, గత రెండు నెలలతో పోలిస్తే స్వల్ప వృద్ధిని నమోదు చేసింది.
ప్రస్తుతం ఈ ఫ్రెంచ్ బ్రాండ్ భారత మార్కెట్లో మొత్తం ఐదు మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో కంపెనీ ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ అయిన సిట్రోయెన్ సి3 అత్యధిక అమ్మకాలతో దూసుకుపోతోంది. అలాగే కొత్తగా వచ్చిన బసాల్ట్ కూపే కారుకు కూడా కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికీ, కంపెనీకి చెందిన ఒక ప్రీమియం మోడల్ మాత్రం జూన్ నెలలో బోణీ కూడా కొట్టలేకపోయింది. ఆ కారు పేరే సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్. గత జూన్ నెలలో ఈ కారు ఒక్కటంటే ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు.

సిట్రోయెన్ ఇండియా విడుదల చేసిన తాజా సేల్స్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో సి5 ఎయిర్‌క్రాస్ మోడల్ అమ్మకాలు అత్యంత ఘోరంగా పడిపోయాయి. జనవరి నెలలో కేవలం రెండు కార్లు, ఫిబ్రవరిలో రెండు కార్లు అమ్ముడవ్వగా.. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ కారు ఖాతా కూడా తెరవలేదు. ఇక మే నెలలో కేవలం ఇద్దరు కస్టమర్లు మాత్రమే ఈ కారును కొనుగోలు చేశారు.
జూన్ నెల వచ్చేసరికి దీని అమ్మకాలు మళ్లీ సున్నాకి పడిపోయాయి. అంటే గత ఆరు నెలల కాలంలో దేశవ్యాప్తంగా అమ్ముడైన సి5 ఎయిర్‌క్రాస్ కార్ల సంఖ్య కేవలం ఆరు మాత్రమే. అదే సమయంలో కంపెనీకి చెందిన మిగతా మోడళ్లు అయిన సి3, ఎయిర్‌క్రాస్, ఈ-సి3 కార్లు వందల సంఖ్యలో అమ్ముడవుతూ కంపెనీని ఆదుకుంటున్నాయి. కస్టమర్లు ఈ లగ్జరీ కారుపై ఆసక్తి చూపించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఈ కారు అమ్మకాలు ఇంతలా పడిపోవడానికి కంపెనీ తీసుకున్న ఒక నిర్ణయం కూడా కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సిట్రోయెన్ సంస్థ తన సి5 ఎయిర్‌క్రాస్ మోడల్‌లో లభించే ఎంట్రీ లెవెల్ బేస్ వేరియంట్ ఫీల్‌ను భారత మార్కెట్లో నిలిపివేసింది. ఈ వేరియంట్‌ను కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించింది. ఇది ఈ మోడల్‌లోనే అత్యంత తక్కువ ధరకు లభించే కారు.
ఈ బేస్ వేరియంట్ క్లోజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ కారును కొనడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఎంట్రీ లెవెల్ మోడల్ బంద్ కావడం వల్ల ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఏకంగా 3 లక్షల రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం కస్టమర్లకు ఈ లగ్జరీ ఎస్‌యూవీ కేవలం టాప్-స్పెక్ వేరియంట్ అయిన షైన్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ.39.99 లక్షలుగా ఉంది.

ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ కారులో కంపెనీ అత్యంత పవర్‌ఫుల్ ఇంజన్‌ను అందించింది. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారులో 1997 సీసీ సామర్థ్యం కలిగిన డీడబ్ల్యూ10ఎఫ్‌సీ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 177 పీఎస్ పవర్, 400 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
ఈ కారులో 52.5 లీటర్ల సామర్థ్యం గల భారీ ఫ్యూయల్ ట్యాంక్‌ను అందించారు. ఇంత పెద్ద ఇంజన్ ఉన్నప్పటికీ, ఈ కారు లీటరుకు 17.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. డైమెన్షన్స్ పరంగా చూస్తే, ఈ కారు 4500 మిమీ పొడవు, 1969 మిమీ వెడల్పు, 1710 మిమీ ఎత్తును కలిగి ఉండటమే కాకుండా, 2730 మిమీల పెద్ద వీల్‌బేస్‌తో వస్తుంది.
ఫీచర్ల పరంగా చూస్తే ఈ కారు ఏమాత్రం తక్కువ కాదు. ఇందులో ఎల్‌ఈడీ విజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, త్రీడీ ఎల్‌ఈడీ రియర్ ల్యాంప్స్, ఓఆర్‌విఎమ్‌లపై ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. కారు లోపల డ్రైవర్ కోసం 31.24 సెంటీమీటర్ల కస్టమైజబుల్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సెంట్రల్‌లో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే 25.4 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
లగ్జరీ లుక్ కోసం మెట్రోపాలిటన్ బ్లాక్ ఇంటీరియర్‌తో పాటు క్లాడియా లెదర్ సీట్లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ అందించారు. సుఖవంతమైన ప్రయాణం కోసం సిట్రోయెన్ అడ్వాన్స్‌డ్ కంఫర్ట్ ప్రోగ్రెసివ్ హైడ్రాలిక్ కుషన్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. కారు వెనుక భాగంలో 580 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది, ఒకవేళ వెనుక సీట్లను ఫోల్డ్ చేస్తే ఈ బూట్ స్పేస్ సామర్థ్యం ఏకంగా 720 లీటర్లకు పెరుగుతుంది.
ప్రయాణీకుల భద్రతకు ఈ కారులో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ప్రమాద సమయాల్లో రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. వీటితో పాటు బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (BLIS), డ్రైవర్ అలసటను గుర్తించే కాఫీ బ్రేక్ అలర్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
పార్కింగ్ సులభతరం చేయడం కోసం ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లతో కూడిన రివర్స్ కెమెరాను కూడా ఇచ్చారు. చిన్న పిల్లల రక్షణ కోసం ISOFIX చైల్డ్ మౌంట్లు కూడా ఉన్నాయి. ఇన్ని లగ్జరీ ఫీచర్లు, గరిష్ట భద్రతా ప్రమాణాలు ఉన్నప్పటికీ, కేవలం బ్రాండ్ ఇమేజ్ లోపించడం, అధిక ధర కారణంగా ఈ కారు భారతీయ మార్కెట్లో గట్టి పోటీని ఇవ్వలేక వెనుకబడిపోయింది.







