HomeTelanaganahyderabadపనులు చెయ్యమంటే టైంపాస్ చేస్తున్నారు..!

పనులు చెయ్యమంటే టైంపాస్ చేస్తున్నారు..!

  • మున్సిపల్ అధికారులకు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ అల్టిమేటం
  • మున్సిపల్ అధికారులు స్పందించకపోతే నేనే రంగంలోకి దిగుతా!
  • మాటలు మానేసి పనులు చేసి చూపించండి: 8వ వార్డ్ కౌన్సిలర్ హెచ్చరిక
  • కంప్లైంట్ ఇస్తే ‘అటాక్ కౌంటర్లు’ ఇప్పిస్తారా? పాలకవర్గం తీరుపై జావీద్ ఆగ్రహం

జనవాహిని ప్రతినిధి తాండూరు: మున్సిపల్ అధికారులు, పాలకవర్గం తమ అలసత్వాన్ని వీడి 8వ వార్డులో తీవ్రతరమవుతున్న చెత్త సేకరణ, పారిశుధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో నేరుగా మైదానంలోకి దిగి ప్రజలతో కలిసి చెత్తను శుభ్రం చేస్తానని తాండూరు మున్సిపల్ రాజీవ్ కాలనీ 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ హెచ్చరించారు. ఆదివారం ఆయన తన వార్డు పరిధిలో పర్యటించి పారిశుధ్య లోపాలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మున్సిపల్ యంత్రాంగంపై నిప్పులు చల్లారు.
ఈ సందర్భంగా జావీద్ మాట్లాడుతూ.. వార్డులో చెత్త సేకరణ పూర్తిగా పడకేసిందని మండిపడ్డారు. రెండు, మూడు రోజులకోసారి ఉదయం 11 గంటలకు కేవలం ఒక చిన్న ఆటో మాత్రమే వస్తోందని, ట్రాక్టర్ జాడ ఎక్కడా లేదని విమర్శించారు. అంత పెద్ద వార్డు వ్యర్థాలను ఒక చిన్న ఆటో మోయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. కేవలం తమ వార్డే కాకుండా పట్టణంలోని 36 వార్డుల్లోనూ ఇదే అధ్వాన పరిస్థితి ఉందన్నారు. పట్టణంలో చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా తిరగడం లేదు గానీ, డీజిల్ వాడకం లెక్కలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు. క్రమబద్ధంగా చెత్తను ఎత్తేందుకు తక్షణమే తమ వార్డుకు ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారులు సేవలు సరిగ్గా అందిస్తేనే ప్రజలను రోడ్డుపై చెత్త వేయవద్దని నిలదీసే హక్కు ఉంటుందని తేల్చిచెప్పారు.

ab3d3051-95af-42cc-9b8e-471a0fd1dab8
పారిశుధ్య సమస్యలు, డీజిల్ వాడకం లెక్కలపై మున్సిపల్ కమిషనర్‌కు తాను వినతిపత్రం ఇస్తే.. దానిని పరిష్కరించడం మానేసి, కొందరు కాంగ్రెస్ నాయకులకు స్క్రిప్ట్ అందించి తనపై ‘అటాక్ కౌంటర్లు’ ఇప్పించడాన్ని జావీద్ తీవ్రంగా ఖండించారు. కంప్లైంట్ ఇస్తే ఎదురుదాడి చేయించడం కాదు.. చేతనైతే పాలన తీరును ప్రజా సమస్యల పరిష్కారంలో చూపించండి అని సవాల్ విసిరారు. మున్సిపల్ కమిషనర్, చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే మాటలు చెప్పడం మాని చేతల్లో పని చేసి చూపించాలన్నారు. ప్రజల అప్లికేషన్లను పక్కనపడేసి రాజకీయ ప్రచారాలు చేసుకోవడం వల్ల ప్రజలకు పైసా ఉపయోగం లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలు, ‘ప్రజా పాలన’ దరఖాస్తులతో పాటు ఉచిత విద్యుత్ బిల్లుల మినహాయింపులు కూడా క్షేత్రస్థాయిలో పెండింగ్‌లోనే మూలుగుతున్నాయని ఆరోపించారు. నెలాఖరు దగ్గరపడుతున్నా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందక వృద్ధులు, వికలాంగులు అల్లాడుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే బాధ్యతాయుతంగా పనిచేయాలే తప్ప కౌంటర్లు ఇవ్వడం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగంలో చలనం రాకపోతే, పారిశుధ్య పనులను స్వయంగా తానెత్తుకొని నిరసనను ఉధృతం చేస్తానని జావీద్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments